వైసీపీకి ఎయిడెడ్ కష్టాలు.. కవర్ చేసుకోడానికి అష్టకష్టాలు..

Deekshitha Reddy
వైసీపీ ప్రభుత్వానికి ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలిసారిగా తీవ్ర స్థాయిలో విధ్యార్ధుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వం మంచికోసం చేసినా అది విద్యార్థులపై చెడు ప్రభావం చూపించేలా ఉంది. దీంతో ఏకంగా సీఎం జగన్ ప్రెస్ మీట్ లో ఎయిడెడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు, వైసీపీ అనుకూల మీడియాలో కూడా, ఎయిడెడ్ విలీనంతో అసలు సమస్యే లేదని, అదంతా విద్యార్థుల మంచికేనంటూ చెబుతున్నారు. అయినా విద్యార్థులు మాత్రం వైసీపీ నేతల మాటలను అసలు పట్టించుకోవడం లేదు. ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అందరూ బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. దుమ్మెత్తిపోస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ పాఠశాలల విషయంలో మరో కోణం ఉందని చెబుతోంది. పాఠశాలలో సరైన భోధన కొరవడిందని, వసతుల కల్పన కూడా లేదని చెబుతున్నారు. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అంటున్నారు. దీనికి తోడు ఎయిడెడ్ కళాశాలల్లో చేరేవారి సంఖ్య కూడా రోజురోజుకీ తగ్గిపోతోందని అంటున్నారు. సాంప్రదాయ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గడం కూడా ఎయిడెడ్ కళాశాలల మూసివేతకు ఓ కారణంగా తెలుస్తోంది.
విద్యార్థులకు మంచి విద్య అందడం లేదని, అందుకే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్ మెంటు అమలవుతుందని, విద్యార్థులకు దీనివలన నష్టం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఎయిడెడ్ కళాశాలల విషయంలో వైసీపీ ప్రభుత్వం దిద్దుకోలేని తప్పు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనంతపురంలో విద్యార్థుల నిరసన ఎపిసోడ్ కూడా బాగా హైలైట్ అయింది. విద్యార్ధులపై పోలీసులు లాఠీలు ఝళిపించడం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఈ ఆందోళనలు అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులను ప్రయోగించిందని, ఇప్పటికే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వైసీపీ ప్రభుత్వంపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం సమస్య తీవ్రతను గుర్తిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: