చైనా, పాక్ కుట్రలు.. తేల్చేసిన భారత నిఘా వర్గాలు..!
ఇక భారత్ కు అతిపెద్ద ముప్పుగా చైనా మారిందని డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సరిహద్దులను కాపాడుకునేందుకు గతేడాది తరలించిన సైన్యం ఇప్పట్లో రాలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారంలో విశ్వాస లోపం.. అనుమానాలే అడ్డు అని తెలిపారు. గల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో మౌలిక వసతులు పెంచినట్టు చెప్పారు. చైనా ఎలాంటి దుస్సాహసం చేసిన ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు.
ఇక ఆఫ్ఘానిస్థాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్న అమెరికా భారీ స్థాయిలో ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లింది. వీటని తాలిబన్లు పాకిస్థాన్ లోని తీవ్రవాద సంస్థలకు అమ్మేస్తున్నారు. దీంతో టెర్రరిస్టులు మన దేశంపై దాడి చేస్తారనే ఆందోళన నెలకొంది. అయితే ఆప్ఘాన్ నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాలతో ఉగ్రవాద సంస్థలు ముందుగా పాక్ లోనే విధ్వంసం సృష్టించే ప్రమాదముందని.. వాటిని వినియోగించకుండా అడ్డుకుంటామని భారత్ తెలిపింది.
మరోవైపు పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో ఉన్న భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఇద్దరు బంగ్లాదేశ్ స్మగ్లర్లు హతమయ్యారు. భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లను ఆపేందుకు ప్రయత్నించిన బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేయడంలో
ఒక జవాన్ కూడా గాయపడినట్టు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బంగ్లాదేశ్ స్మగ్లర్లను హతమార్చినట్టు తెలిపింది. మొత్తానికి భారత సరిహద్దుల దగ్గర అలజడి కొనసాగుతూనే ఉంది. పాక్, చైనాలే కాదు బంగ్లాదేశ్ కు చెందిన స్మగ్లర్లు సైతం భారత జవాన్లపై పంజా విసురుతున్నారు.