జగన్ను కెలుకుతున్న కేసీఆర్ టీమ్.. ఏం ఓపికరా బాబూ..?
హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతో దిమ్మతిరిగిందో.. లేక హుజూరాబాద్ ఫలితం నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారో తెలియదు కానీ.. టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పొరుగు రాష్ట్రం ఏపీతో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. కేసీఆర్ స్వయంగా తమను ఏపీలో పార్టీ పెట్టమని వేల కొద్దీ ఉత్తరాలు, ఫోన్లు వస్తున్నాయని ఓ రాయి విసిరారు. ఇక ఇప్పుడు తాజాగా మరో మంత్రి ఏకంగా హద్దులు దాటేశాడు. పక్కరాష్ట్రం సీఎంను వాడు, వీడు అంటూ మాట్లాడుతూ తన స్థాయి దిగజార్చుకున్నాడు.
జగన్ రోజూ కేంద్రం ముందు బిచ్చమెత్తుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అప్పట్లో ఉమ్మడి ఏపీ విడిపోతే.. తెలంగాణ అడుక్కుతింటుందని ప్రచారం చేశారని.. ఇప్పుడు ఆ ఆంధ్రోల్లే అడుక్కుతింటున్నారని ప్రశాంత్ రెడ్డి రెచ్చిపోయారు. కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలో టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అది కేంద్రాన్ని వ్యతిరేకిచే దీక్ష.. అసలు అక్కడ ఏపీ ప్రస్తావన అవసరమే లేదు.
కేంద్రాన్ని ఎంతైనా తిట్టుకోవచ్చు.. కానీ.. పనిగట్టుకుని జగన్ ను టీఆర్ఎస్ నాయకులు తిట్టాల్సిన అవసరం ఏముంది.. సొంత ప్రభుత్వాన్ని ఏ మంత్రి అయినా ఎంతైనా పొగుడుకోవచ్చు.. కానీ.. పొరుగు రాష్ట్రాన్ని అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. ఏపీ సీఎం జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. సజ్జల వంటి సీనియర్ నాయకులతో బదులు చెప్పించడం తప్ప.. లైట్ గానే తీసుకుంటున్నారు. ఎంతైనా జగన్ ఓపికకు మెచ్చుకోవాల్సిందేనేమో.