ఎస్ఈసీ, డీజీపీకి చంద్రబాబు లేఖ..!
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి రేపు ఎన్నికలు జరుగనుండగా.. సమస్యాత్మక వార్డులకు అదనపు బలగాలు పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం చిత్తూరు ఎస్పీ, కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఈసీ.. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. ప్రతిపక్ష అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించాలంది. కుప్పంలో తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని ఎస్ఈసీ ఆదేశించింది.
టీడీపీ అధినేత చంద్రాబాబుకు పెట్టని కోట కుప్పం. అయితే.. అక్కడ బాబు హవా తగ్గినట్టు కనిపిస్తోంది. 2019లో ఆయన మెజారిటీ 17వేలు తగ్గింది. అంతేకాదు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మండలంలోని టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 25వార్డులున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక సోమవారం జరగనుంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబుకు ఇది కఠిన పరీక్షగా మారింది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 36సర్పంచ్, 68వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. సోమవారం నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మరో 12మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండాలని మనమూ కోరుకుందాం..