కుప్పం టీడీపీ : పిల్లాడయిన జగన్ సాధించాడ్రా!

RATNA KISHORE


సొంత బలం లేకుండా బ‌ల‌గం సిద్ధంగా లేకుండా అస‌లు ఆ త‌రహా ఆలోచ‌నే చేయ‌కుండా రాజ‌కీయం చేయ‌కూడదు. కానీ చంద్ర‌బాబు ఇదే చేస్తున్నాడు. ప‌దే ప‌దే త‌ప్పిదాలే చేస్తున్నాడు. ఎప్ప‌టిలానే జ‌గ‌న్ త‌న పాత త‌ప్పుల నుంచి కొంత మంచిని ఏరుకుని ముందుకు పోతుంటే, బాబు మాత్రం త‌న పాత త‌ప్పిదాలే మ‌ళ్లీ మ‌ళ్లీ తెర‌పైకి వచ్చేలా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్లు ఫెయిల్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో జూనియర్లు పార్టీకి అంద‌కుండా పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ అప‌జ‌యాల బాట అన్న‌ది చంద్ర‌బాబు స్వ‌యంకృతం. నాయ‌కులు ఎవ్వ‌రైనా స‌రే తాము అధికారంలో ఉన్నామ‌ని, ముఖ్య‌మంత్రి లాంటి ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్నామ‌ని, త‌మ‌కు క్ష‌ణం కూడా తీర‌క దొర‌క‌డం లేదు అని చెబుతూ  సొంత నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి వైపు చూడ‌క‌పోవ‌డం త‌గ‌ని ప‌ని! ఇదే స‌మ‌యంలో సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కంటూ ఉన్న క్యాడ‌ర్ ఎటు పోతుందో ఏవిధంగా ప‌నిచేస్తుందో ఏ విధంగా వారి ఆలోచ‌న‌లున్నాయో తెలుసుకోక‌పోవ‌డం కూడా త‌ప్పు. ఇలాంటి త‌ప్పిదాల కార‌ణంగానే గ‌తంలో ఎంద‌రో లీడ‌ర్లు త‌మ ఇంటి నుంచి గెల‌వ‌లేక విప‌క్షాలు చేసి ర‌చ్చ లో ఉనికి కూడా కోల్పోయారు.



ముఖ్యంగా తాము పుట్టిన గ్రామాలు, తాము న‌డిచిన పాఠ‌శాల‌లు వీటి నిర్వ‌హ‌ణ‌పై కూడా దృష్టి సారించ‌కుండా కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికీ ఉంటున్నారు. అది ఏమాత్రం త‌గ‌ని ప‌ని. మ‌రి! కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి తాగు నీరు తానే ఇస్తాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. మంచిదే అలానే సీమ‌కు తాగునీరు కూడా తానే ఇవ్వ‌గ‌ల‌నని చెబుతున్నాడు జ‌గ‌న్ ఇది కూడా మంచిదే! గోదావ‌రి నీళ్లు సీమ‌కు ఇస్తే త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చెప్పాడు పెద్ద‌న్న కేసీఆర్. ఆ మాట ఆధారంగా పొరుగు ముఖ్య‌మంత్రి తో ఉన్న స‌ఖ్య‌త కార‌ణంగా తాను అనుకున్న విధంగానో ప్ర‌జ‌లు అనుకుంటున్న విధంగానో తాగునీరు సీమ‌కు ద‌క్క‌డం అన్ని ప్రాంతాల‌కూ అంద‌డం అన్న‌ది సాధ్య‌మేన‌ని క‌ల‌లు కంటున్నాడు జ‌గ‌న్. ఈ పాటి క‌ల‌లు చంద్ర‌బాబుకు క‌ల‌గ‌లేదా? ఈ పాటి క‌ల‌లు ఆ వేళ కుప్పం నేత‌ల‌కు కూడా క‌ల‌గ‌లేదా? ఏదేమైన‌ప్ప‌టికీ పిల్లాడ‌యిన జ‌గ‌న్ అనుకున్న‌ది సాధించాడ్రా!



కుప్పంలో వైసీపీ పాగా వేయ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ముందు నుంచి వైసీపీ కోరుకున్న విధంగానే ఇక్క‌డ రాజ‌కీయం ఉంటోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌గ‌న్ కోరుకున్న విధంగానే ఇక్క‌డ యంత్రాంగం కూడా ప‌నిచేస్తోంది. ప‌క్క జిల్లాల నుంచి, పొరుగు ప్రాంతాల నుంచి ఒక‌వేళ ఓట‌ర్లు వ‌చ్చినా, వాటిని అడ్డుకోవ‌డంలో నిజంగానే టీడీపీ విఫ‌ల‌మైంది. అయితే గ‌తంలో అధికార దుర్వినియోగం లేదా అన్న‌ది వైసీపీ ప్ర‌శ్న. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా ప్ర‌త్యేక మ‌యిన చ‌ర్య‌లేవీ ఇరు వ‌ర్గాల‌పై తీసుకోక‌పోవ‌డం గ‌మనార్హం. అంటే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ప్పేమీ చేయ‌లేదు, అన్ని త‌ప్పులు కూడా టీడీపీనే చేసింద‌ని అంటారా? అంటే అనండి కానీ అధికారం ఉన్న‌వారే ఎక్కువ త‌ప్పులు చేసేందుకు, అధికారంలో ఉన్న‌వారే ఎక్కువ డ‌బ్బులు పంచేందుకు ఆస్కారం ఉంది.



ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా మొద‌ట్నుంచి చంద్ర‌బాబు కోట‌ను ప‌గుల‌కొట్టాల‌న్న తాప‌త్ర‌యంలోనే ఇక్క‌డ మంత్రాంగం న‌డుపుతున్నారు. స్థానిక ఎన్నిక‌లు మొదలుకొని పుర పోరు దాకా త‌న మ‌నుషుల‌ను మోహ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో పడ్డాడు. కొన్ని చోట్ల టీడీపీకి అభ్య‌ర్థులే దొర‌క‌కుండా, దొరికినా కూడా నామినేష‌న్ కూడా వేసేందుకు వీల్లేకుండా సీన్ క్రియేట్ చేశాడు. అప్పుడు టీడీపీ ఇప్పుడు వైసీపీ ఈ విధంగా ఎవ‌రికి వారే త‌మ పేరు పరువు ఆర్థిక లబ్ధి అన్నీ నిల‌బ‌డేలా, చేకూరేలా నానా అవ‌స్థ‌లూ ప‌డ్డాయి. క‌నుక ఎన్నికల్లో వాళ్లు మంచి వీళ్లు చెడ్డ అన్న‌వి ఏమీ ఉండవు. త‌క్కువ త‌ప్పు ఎక్కువ త‌ప్పు అన్న‌వి మాత్ర‌మే ఉంటాయి. ఇవి మాత్ర‌మే ప్ర‌భావితం చేస్తాయి రేప‌టి రాజ‌కీయాల‌ను దిశా నిర్దేశం కూడా చేయ‌గ‌ల‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: