పెళ్లి కోసం బ్రాహ్మణ కుర్రాళ్ల తిప్పలు చూశారా..?

Chakravarthi Kalyan
పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో ఓ తీయని మజిలీ. తనకు తగిన జీవిత సహచరి కానీ.. సహచరుడు కానీ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వివాహం విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరు లైఫ్‌లో సెటిల్ అయితే కానీ పెళ్లిమాట ఎత్తరు.. ఎవరి సంగతి ఎలా ఉన్నా.. 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకోవడం సరైన సమయం అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఈ మధ్య కాలంలో 30 దాటందే చాలా మంది కుర్రాళ్లు, యువతులు.. పెళ్లి పీటలు ఎక్కడం లేదు.


అయితే.. అనేక కారణాల వల్ల కొన్ని కులాల్లో అమ్మాయిల సంఖ్య బాగా తగ్గింది. ఆ కులాల్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టమవుతోంది. తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పుడు ఇదే ఇబ్బంది వచ్చిందట. ఆ కులంలో పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి కాని వారు దాదాపు 40 వేల మంది వరకూ ఉన్నారట. అందుకే ఈ కుర్రాళ్ల బాధలు చూడలేక.. తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్‌ ఓ  ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది.


అదేంటో తెలుసా.. తమిళనాడుకు చెందిన పెళ్లికాని ప్రసాదులకు ఉత్తరాది సంబంధాలు చూస్తున్నారట. ప్రత్యేకించి ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లో ఇదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కుమార్తెలను వెదుకుతున్నారట. ఈమేరకు ఓ తమిళ పత్రికలో తమిళ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ఓ ప్రకటన ఇచ్చారు. తమిళనాడులో 30-40 ఏళ్ల వయసున్న పెళ్లి కాని బ్రాహ్మణుల సంఖ్య 30-40 వేలకు వరకు ఉంటుందని ఆయన అంటున్నారు.


వీరికి తమిళనాడు పరిధిలో ఎక్కడా సంబంధాలు దొరకడం లేదట. తమిళనాడులో బ్రాహ్మణ కులంలో  10 మంది అబ్బాయిలకు ఆరుగురు మాత్రమే అమ్మాయిలు ఉన్నారట. అందువల్లే మిగిలిన వారు పెళ్లికాకుండా మిగిలిపోతున్నారు. అందుకే వారి కోసం దిల్లీ, లఖ్‌నవూ, పట్నాల్లో ఏజంట్లను పెట్టుకుని పెళ్లి కూతుళ్ల వేట ప్రారంభించారు. మరి ఈ పెళ్లి కాని ప్రసాదుల ప్రయత్నాలు ఫలిస్తాయా.. ఇప్పటికైనా సంబంధాలు దొరుకుతాయా.. ఏమో.. ఏమైనా ఈప్రయత్నం మాత్రం మెచ్చుకోవాల్సిందే సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: