లోకల్ ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యే సీటు డౌటేనా?

M N Amaleswara rao
అధికార బలం ఉన్నా సరే తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కొన్నిచోట్ల వైసీపీ చేతులెత్తేసింది. ఊహించని విధంగా టీడీపీ సత్తా చాటింది. అలా దర్శి మున్సిపాలిటీలో కూడా టీడీపీ గెలిచేసింది. అసలు దర్శిలో టీడీపీకి ఏ మాత్రం బలం లేదని, టీడీపీ వాళ్ళకే తెలుసు. పైగా వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. ఒకవైపు ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ ఉన్నారు..మరోవైపు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులు ఉన్నారు.

ఇంతమంది ఉన్నా సరే దర్శిలో వైసీపీ గెలవలేదు. ఇక ఇక్కడ టీడీపీకి ఇంచార్జ్‌గా పమిడి రమేష్ ఉన్నారు. ఈయన ఇప్పుడుప్పుడే నియోజకవర్గంపై పట్టు తెచ్చుకుంటున్నారు. అంటే నియోజకవర్గంపై సరిగా పట్టు కూడా లేదు. అలాంటిది దర్శి మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది. అయితే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు దర్శిలో పార్టీని గెలిపించడానికి ఐకమత్యంగా పనిచేశారు. కానీ వైసీపీలో అదే ఐకమత్యం కొరవడింది...ఆధిపత్య పోరు పెరిగింది. అందుకే వైసీపీకి చెక్ పడింది.


అయితే ఈ ఫలితం ఎఫెక్ట్ మిగతా వైసీపీ నేతల మీద ఎంత పడుతుందో తెలియదు గానీ, ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్‌పై మాత్రం బాగా పడుతుంది. ఒక ఎమ్మెల్యేగా..తన మున్సిపాలిటీలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనదే. కానీ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదనే చెప్పాలి. ముందు నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించడానికే చూశారు గానీ, ఆధిక్యం దక్కించుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకే ఇప్పుడు మున్సిపాలిటీలో దెబ్బతినాల్సి వచ్చింది.

ఇప్పటికే ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని పలు సర్వేలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రజలకు మరింత దగ్గరవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. కానీ ఎమ్మెల్యే ఆ పనిచేసినట్లు లేరు. అందుకే ఇలాంటి ఫలితం ఎదురైందని చెప్పాలి. ఇక ఇలా ఫెయిల్ అయిన మద్దిసెట్టికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దొరకడం డౌటే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: