సామినేని లక్ బాగుంది.. మంత్రి ఫిక్స్?

M N Amaleswara rao
త్వరలోనే ఏపీ మంత్రివర్గంలో మార్పులు జరుగతాయని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ మొదట్లో చెప్పిన ప్రకారం....ఇప్పుడున్న మంత్రులని పక్కనబెట్టి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో ప్రస్తుతం కాపు కోటాలో మంత్రిగా ఉన్న పేర్ని నాని సైడ్ అయితే..ఆయన ప్లేస్‌లో అదే వర్గానికి చెందిన సామినేని ఉదయభానుకు పదవి వస్తుందని కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

అయితే సొంత నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే అవకాశాలు ఉంటాయనే విధంగా గతంలోనే సీఎం జగన్...నేతలకు సూచించారు.  ఈ క్రమంలోనే సామినేని తన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో సత్తా చాటుతూ వస్తున్నారు. పంచాయితీల్లో పార్టీని గెలిపించుకున్నారు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వన్ సైడ్‌గా పార్టీని గెలిచేలా చేసుకున్నారు. కానీ తాజాగా జరిగిన జగ్గయ్యపేట మున్సిపాలిటీని స్వల్ప తేడాతో కైవసం చేసుకున్నారు.

ఇక్కడ కాస్త అటూ ఇటైతే రిజల్ట్ మారిపోయేది. పేటలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 31 వార్డులు ఉంటే వైసీపీ 18 వార్డుల్లో గెలవగా, టీడీపీ 13 వార్డుల్లో గెలిచింది. అయితే రెండు వార్డుల్లో రీకౌంటింగ్‌లు చేసి రిజల్ట్ తారుమారు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య...టీడీపీ అభ్యర్ధులకు బాగానే అండగా నిలబడ్డారు. కానీ వైసీపీ అధికార బలం ముందు చివరిలో చేతులెత్తేయడంతో వైసీపీ గెలిచేసింది.

ఇక ఎలా గెలిస్తే ఏముంది..చివరికి జగ్గయ్యపేట మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇందులో గానీ ఓడితే సామినేని మంత్రి పదవి డౌట్‌లో పడేది...లక్కీగా గెలవడంతో...ఆయనకు పదవి ఫిక్స్ అని కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రచారం నడుస్తోంది. మొత్తానికి మున్సిపాలిటీలో గెలిచి సామినేని మంత్రి పదవిని ఫిక్స్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. చూడాలి మరి సామినేనికి మంత్రి పదవి దక్కుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: