ఏపీలో జలవిలయం.. ఇదిగో ఇంత నష్టం జరిగింది..!
భారీ వర్షాల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 172 మండలాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటిలో చిత్తూరులో అత్యధికంగా 66 , అనంతపురంలో 46, కడపలో 48 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో వర్షాల కారణంగా తీవ్ర ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకూ అధికారికంగా 24 మంది వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది. ఇంకా 17 మంది గల్లంతయ్యారని పేర్కోంటూ ఏపీ సర్కారు గణాంకాలు విడుదల చేసింది.
భారీ వర్షాల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 23,994 మంది ప్రభావితం అయ్యారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నాలుగు జిల్లాల్లోనూ వర్షాల కారణంగా 2,33,45 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మరో 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా 7 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇప్పటికే సహాయ శిబిరాల్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి 2 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రహాదారులు, విద్యుత్ పునరుద్ధరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ జల విలయం నుంచి ఆ ప్రాంతాలు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాయో మరి.