కేసీఆర్ చెప్పినట్టే చేస్తున్న కిసాన్ మోర్చా..!
ఢిల్లీ రైతుల ఆందోళనల్లో చనిపోయిన అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున 750మందికి 3లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. కేంద్రం కూడా 25లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి పోరాటం ఎంతో గొప్పదని.. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. అలాగే వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్ లో కొత్త వ్యవసాయ బిల్లులను తాము వ్యతిరేకించామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కావాలంటే లోక్ సభ, రాజ్యసభ రికార్డులను చూసుకోవాలన్నారు. అలాగే చట్టాలు రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. చట్టాల రద్దుపై దేశంలో ఎవరూ మోడీని నమ్మడం లేదనీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల స్టంట్ అని అంటున్నారని తెలిపారు. కనీస మద్ధతు ధర కోసం చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
అంతేకాదు కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదనీ..బావుల దగ్గర కరెంట్ మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్ లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.