చివరి గింజ వరకు పోరాటం అంటున్న టీఆర్ఎస్..!
అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే... కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు అటు కాంగ్రెస్, ఇటు గులాబీ పార్టీ నేతలు ప్రయత్నించారు. వరి కొనుగోలు అంశంపై పార్లమెంట్లోనే కేంద్రాన్ని నిలదీస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. వరి కొనుగోలుపై వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టగా... టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలోనే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్సీఐ కొనుగోళ్లు చేపట్టాలని గులాబీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లేకార్డులు ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని నినాదాలు చేశారు ఎంపీలు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని కూడా టీఎర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్లకార్డులతో నిరసన చేశారు. రైతులకు ఉచిత కరెంట్ అందించడం వల్లే రాష్ట్రంలో వరి దిగుబడులు పెరిగాయన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. రైతుల సంక్షేమం కోసం అవసరమైన విధానాలను కేంద్రం తక్షణమే తీసుకురావాలని కోరారు.