టీడీపీకి బీజేపీ సపోర్ట్.. అన్నమయ్య చుట్టూ రాజకీయం..

Deekshitha Reddy
ఏపీ రాజకీయాలు మళ్ళీ హీటెక్కాయి. రాష్ట్రంలో వచ్చిన భారీ వరదలే ఇప్పుడు హాట్ టాపిక్.. వరద రాజకీయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. అన్నమయ్య ప్రాజెక్ట్ మట్టికట్ట తెగిపోవడంతో ఈ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఈ అంశంపై గట్టిగానే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రమే కాకుండా, పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేయడంతో అగ్గి రాజుకుంది. దీంతో వైసీపీ మంత్రి అనీల్ కూడా ఈ విమర్శలకు ఘాటుగానే బదులిస్తున్నారు. అయితే వైసీపీ మంత్రి అనీల్ ఈ ఘటనను సమర్ధించుకోవడంపై అటు చంద్రబాబు కూడా మండిపడుతున్నారు.
పార్లమెంట్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు రావడంతో మంత్రి అనీల్ అలెర్ట్ అయ్యారు. బీజేపీ కావాలనే తమ పార్టీని టార్గెట్ చేసిందని ఫైర్ అయ్యారు. పెన్నా బేసిన్ కు చరిత్రలో ఎన్నడూ రానంత వరద వస్తే ఎవరైనా ఏం చేయగలరని ప్రశ్నించారు. అన్ని గేట్లు ఎత్తినా మట్టికట్ట కొంతమేర దెబ్బతిందని చెప్పారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాలు గత ప్రభుత్వ తప్పిదాలేనని చెప్పుకొచ్చారు. ప్రకృతి విపత్తు కారణంగా వరదలు సంభవిస్తే శవరాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత కూడా లేదన్నారు. టీడీపీకి బీజేపీ కూడా తోడై ఇలా విమర్శలు చేయడం సిగ్గుచేటని చెప్పుకొచ్చారు.
అయితే మంత్రి అనీల్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగానే స్పందించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం గత ఏడాది కాలంలో అన్నమయ్య ప్రాజెక్టుకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. దాదాపుగా 60 మంది ప్రాణాలు పోయేలా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై న్యాయ విచారణ జరగాలని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని.. కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ఓదార్పు పేరుతో సీఎం జగన్ నాటకాలు చేశారని అన్నారు. వరద బాధితులను బెదిరించి నోరెత్తకుండా చేశారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇప్పుడు రాజకీయాలన్నీ అన్నమయ్య ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: