వైసీపీకి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్‌... ఆ వియంలో జ‌గ‌న్‌కు తిరుగులేదా... !

VUYYURU SUBHASH
వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవ‌ల ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఓటీఎస్‌(వ‌న్ టైం సెటిల్మెంట్‌) ప‌థ‌కంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరుగుతున్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ హ‌యాంలోనో.. త‌న హ‌యాంలోనో నిర్మించిన ఇళ్ల‌కు పేద‌ల నుంచి ఇప్పుడు డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ఏంట‌ని.. ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సంబంధించి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని కూడా కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని వీడియోల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఒక్క‌సారిగా ఈ విష‌యంపై అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.
గ‌త ప్ర‌భుత్వాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మురికివాడ‌ల్లో ఉండే పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇచ్చాయి. సెంటు, అరసెంటు భూముల్లోనే ప‌క్కా ఇళ్లు క‌ట్టించి ఇచ్చాయి. అయితే.. ఆ ఇళ్ల‌కు అయిన వ్య‌యాన్ని ప్ర‌భుత్వం షూరిటీతో బ్యాంకుల నుంచి నాబార్డు నుంచి కూడా రుణాలు తీసుకుని.. ఇళ్ల‌ను నిర్మించారు. ఈ నేప‌థ్యంలో ఆయా ఇళ్ల‌కు సంబందించిన పూర్తి హ‌క్కుల‌ను ప్ర‌భుత్వాలు ఆయా ఇళ్ల ల‌బ్ధి దారుల‌కు అందించ‌లేదు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి కాలం గ‌డుస్తున్నా.. ఆయా ఇళ్ల ల‌బ్ధిదారుల‌కు వాటిపై సంపూర్ణ హ‌క్కులు ల‌భించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. దీనికి కార‌ణం.. అప్ప‌టి ప్ర‌భుత్వాలు చేసిన అప్పులు.. ల‌బ్ధిదారులే తీర్చుకునేలా తీర్మానం చేశాయి.
దీంతో పేద‌ల‌కు ఇళ్లు వ‌చ్చినా.. హ‌క్కులు లేకుండా పోయాయి. ప‌లితంగా తాము నివ‌సించే ఇంటిని అమ్ముకునేందుకు, లేదా అప్పుగా తాక‌ట్టు పెట్టేందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. అయితే.. ఏళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు మాత్రం ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఓటు బ్యాంకు కోసం తాప‌త్ర‌య ప‌డిన గ‌త ప్ర‌భుత్వాలు కూడా ఈ విష‌యాన్ని మ‌రుగున ప‌రిచాయి. ఫ‌లితంగా పేద‌ల‌కు త‌మ ఇళ్ల‌పై ఎలాంటి హ‌క్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయా ఇళ్ల‌కు సంబంధించిన అప్పుల‌ను కొంత స్వ‌ల్ప మొత్తం క‌ట్టేస్తే.. తాము రిజిస్ట్రేష‌న్ చేయించి.. ప్ర‌జ‌ల‌కు సొంతం చేస్తామ‌ని.. ప్ర‌క‌టించింది.
అయితే.. దీనిని విప‌క్షం టీడీపీ రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకుంటోంది. జ‌గ‌న్ ఖ‌జానా నింపుకొనేందుకు పేద‌ల ర‌క్తం తాగుతున్నా ర‌ని కూడా వ్యాఖ్యానించింది. దీనిని ప‌రిశీలించిన మేధావులు.. దీనిలో ఎలాంటి త‌ప్పులేద‌ని అంటున్నారు. పైగా జ‌గ‌న్ ఎలాంటి ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేయ‌కుండా.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు కృషి చేస్తున్నార‌ని అంటున్నారు. ఇళ్ల‌పై సంపూర్ణ హ‌క్కులు ఇచ్చేందుకు నాడు ప్ర‌య‌త్నం చేయ‌ని ప్ర‌భుత్వాలు.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హ‌క్కులు లేకుండా చేశాయ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకునిప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: