ఫ్యాన్ ఆంధ్రా : ఏపీ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు ?
కొత్త వేతన సవరణకు సంబంధించి అదేవిధంగా కొన్ని డిమాండ్లకు సంబంధించి ఆంధ్రావనిలో వేతన జీవులు ఇవాళ్టి నుంచి ఉద్యమ బాట పట్టారు. నిరసనలో భాగంగా ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న ప్రధాన ఆరోపణలో భాగంగా వీరంతా నిరసలకు వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు తమ మాటల్లో వేడిని కూడా పెంచారు. తాము అనుకుంటే ప్రభుత్వాలను కూల్చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలే చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా కాస్త ఘాటుగానే వీరు స్పందిస్తూ పొలిటికల్ మైలేజీ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షం నుంచి కూడా మంచి మద్దతు కోరుకుంటున్నారు. ఇదేమీ తప్పు కాకపోయినా గతంలో మాదిరిగా ఇవాళ ఉద్యోగి చేస్తున్న ఉద్యమాలకు ప్రజల నుంచి అయితే మద్దతు రాదు. ఎందుకంటే కేవలం జీత భత్యాల పెంపుదల కోసమే నానా యాగీ చేస్తున్నారన్న వాదనను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే నవ్వుల పాలయ్యేది ఉద్యోగులే! ఇవన్నీ ఆలోచించకుండా ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కూడా తగదని కూడా అంటున్నారు ఇంకొందరు. ఈ తరుణాన ఉద్యోగ సంఘాల వైపు సానుభూతి రాజకీయం అయితే నడవదు. అదేవిధంగా కాస్తో కూస్తో తగ్గి మాట్లాడితేనే జగన్ వినే ఛాన్స్ ఉంటుంది కానీ తమకు తామే గొప్ప వ్యక్తులం తామే రాజకీయాలను శాసించగలం అని చెప్పుకుంటే అంతకుమించిన అవివేకం ఇంకొకటి ఉండదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయాయి.