దిశ యాప్ కే పరిమితమా..? దిశ చట్టం చూడలేమా..?
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మరీ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏపీ శాసనసభలో ఈ దిశ చట్టం ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్రం నుంచి పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో, కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించకుండా పక్కన పెట్టేసింది. దిశ చట్టానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తుతూ రాష్ట్రానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటన్నిటికీ వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీంతో దిశ చట్టం అమలకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన వెంటనే దిశ చట్టాన్ని ఆమోదిస్తామని ఇటీవలే పార్లమెంట్ లో కేంద్రం ప్రకటన కూడా చేసింది.
అయితే దిశ చట్టం అమలు కాకుండానే ఎంతో మందికి ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా దిశ యాప్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆపద సమయంలో తోడుండే అన్నలా ఈ యాప్ ఉపయోగపడుతోంది. ఈ యాప్ ఉపయోగించిన నిమిషాలవ్యవధిలోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఆపదలో ఉండే మహిళలను రక్షిస్తున్నారు. పోలీసు స్టేషన్లకు దూరంగా ఉండే పల్లెల్లో సైతం, గ్రామ సచివాలయ పోలీసుల సహకారంతో ఈ యాప్ సమర్ధవంతంగా పని చేస్తోంది. దీనికి తోడుగా దిశ పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడంతో, అన్యాయం జరిగిన మహిళలు నిర్భయంగా దిశ స్టేషన్లకు వస్తున్నారు. న్యాయాన్ని పొందుతున్నారు. అయితే రెండేళ్లవుతున్న దిశ చట్టానికి ఇంకా ఆమోదం లభించకపోవడం మాత్రమే విశేషం. ప్రతిపక్షాలు ఈ విషంయలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నా.. అంతిమ ప్రయోజనం చూడాలని అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఆ విమర్శలను కొట్టిపారేస్తున్నారు.