వైసీపీ కొత్త పల్లవి: జగన్ హత్యకు కుట్ర..?
చివరకు కడప జిల్లా వరద పర్యటనల్లోనూ చంద్రబాబు వల్లభనేని వంశీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇంకాస్త కొనసాగింపుగా గౌరవ వారం వంటివి జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అంతకు ముందే నందమూరి కుటుంబంతోనూ ప్రెస్ మీట్ పెట్టించారు. ఇలా ఇష్యూను వీలైనంత మేర రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పడు వైసీపీ కూడా అదే చేస్తోంది. కొన్నిరోజుల క్రితం ఖమ్మం జిల్లాలో కమ్మ కులానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీలను హత్య చేస్తే 50 వేలు ఇస్తామని మల్లాది వాసు అనే నాయకుడు కార్తీక కుల సమావేశంలో కామెంట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడు దీన్ని వైసీపీ ఆయుధంగా మలచుకుంటోంది. అంబటి, కొడాలి, వంశీలను చంపించేందుకు కమ్మ నేతలు చందాలు వేసుకుంటున్నారని.. చివరకు జగన్‌ను కూడా చంపించేందుకు కుట్ర జరుగుతోందంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వాదన ప్రారంభించారు. జగన్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు దీన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా కొనసాగిస్తున్నారు. జగన్ హత్యకు కుట్ర జరుగుతోందని.. ఆయన్ను కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నారు.