సర్దార్ సంబరాలు ఎందుకు జరుపుకున్నారు..? గెలుస్తానన్న ధీమా వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..? ఫలితాల కంటే ముందే ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నట్టు..? తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఓ సామెత వినిపిస్తూ ఉంటుంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఏదో లింగం అని, కరీంనగర్ టిఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ కు ఆ సీన్ ఉందో లేదో తెలియదు కానీ సర్దార్ జరుపుకున్న సంబరాల మీద మాత్రం రాజకీయాలు ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. సర్దార్ వెనకున్న ఆ బలం ఎవరు..? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ. ఫలితం రానేలేదు కానీ, తానే ఎమ్మెల్సీ గెలవబోతున్నట్టు, సింగ్ ఈజ్ కింగ్ అన్నట్టు రవీందర్ హంగామా పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాను మేయర్ గా కొనసాగినప్పుడు జిల్లాను శాసించిన రవీందర్ సింగ్ కు కరీంనగర్ రాజకీయాల పై మంచి పట్టు ఉంది.
నాడు ఈటెల అనుచరుల్లో ముఖ్యుడిగా, కుడిభుజంగా చెప్పుకునే రవీందర్ ఈటెల భర్తరఫ్ తర్వాత ఆయన వైపు మళ్ళారని చెప్పుకున్నారు. ఆయన బలంతోనే టిఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగి హైకమాండ్ కు సవాల్ విసిరారని అనుకుంటున్నారు. అందుకే టిఆర్ఎస్ నుంచి భాను ప్రసాద్ బరిలో నిలిచినా తాను రంగంలోనే ఉన్నానని చెప్పుకుంటూ రవీందర్ సింగ్ తొడగొట్టారని ఆయన అనుచరులు అంటున్నారు. అలాంటి సింగ్ కాబోయే కింగ్ తానేనంటూ పోలింగ్ ప్రక్రియ ముగిసి ముగియగానే సంబరాలు చేసుకోవడం పై ఏదేదో చర్చ జరుగుతుంది. ఇంకో మాటమిటంటే ఈ సంబరాల్లో సర్దార్ జీ కూడా పాల్గొనడం విశేషం. సింగ్ ధీమా వెనుక క్రాస్ ఓటింగ్ జరిగే ఉందన్న భరోసా కనిపిస్తోందట. క్రాస్ ఓటింగ్ నిలువరించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తామే గెలుస్తానంటూ రవీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద వెలువడ్డ సంకేతాలతోనే సింగ్ క్యాంపు సంబరాలు చేసుకొని ఉండాలంటూ కొందరు సరికొత్త సమీకరణాలు చూపెడుతున్నారు. ఏమైనా ఈ సంబరాల పై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న వేళ రవీందర్ సింగ్ అనుచరులు మాత్రం ధీమాగానే ఉంటున్నారు.