దీనావస్థలో ధాన్యం కొనుగోలు.. టార్గెట్ రీచ్ అయ్యేనా..!

MOHAN BABU
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ రీచ్ అవుతాయా..? వ్యవసాయ,పౌరసరఫరాల శాఖ వేసిన అంచనాల మేరకు ధాన్యం కేంద్రాలకు వస్తుందా..?అంటే మిశ్రమ సమాధానాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్లో కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగింది. కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో మిల్లర్లు కొనుగోలు, ప్రజావసరాలకు, బహిరంగ మార్కెట్ విక్రయాలకు సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల పోను కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ కొనుగోలు పరిస్థితులను చూస్తుంటే మరో 10 నుంచి17ల.మె. టన్నుల ధాన్యం కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.


 దీంతో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. కేంద్రానికి నివేదించిన లెక్కల ప్రకారం కోటి 30 లక్షల్లో అసలు కేంద్రం విధించిన టార్గెట్ ప్రకారమైనా దాన్యం  వస్తుందా లేదా అన్నది ప్రస్తుత ప్రశ్న.కేంద్రం వాన కాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటానని చెప్పగా, ఇప్పటివరకు కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది.అంటే ఇంకో 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కేంద్రం ఇచ్చిన టార్గెట్ రీచ్ అవుతారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ఎంత ఉత్పత్తి వస్తుందనే వివరాలను భారత ఆహార సంస్థకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా పంపిణీ వివరాలు 60 నుంచి 65 ల.మె.టన్నులు వస్తుందని అంచనా వేయగా,రెండోసారి కోటి 30 ల.మె. టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఎఫ్ సీఐ కి రాశారు.


 కెసిఆర్ రాసిన లేఖలో మాత్రం 92 ల.మె.టన్నుల ధాన్యం వస్తుందని ఆ మేరకు వచ్చే దాన్యాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం తక్కువ కొనుగోలు చేస్తానంటుందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు కేంద్రం చెప్పిన మేరకు కూడా దాన్యం వచ్చేలా లేకపోవడంతో అధికారులు ఇరుకున పడుతున్నారు. దీంతో ఉత్పత్తి అంచనాల్లో తేడాలు ఉండడంతోనే ఈ సమస్య వచ్చిందని స్పష్టమవుతోంది. మొత్తానికి కేంద్రం కొంటామని చెప్పిన టార్గెటే కరెక్ట్ అని పలువురు అంటుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: