అక్కడ ఆ మంత్రి మాటే శాసనం
తొలిసారి పదవి దక్కినా కూడా
జోరు మాత్రం సీఎం కన్నా ఎక్కువ
అన్నది ఓ విమర్శ
ఆయన ఎక్కడికక్కడ వివాదాల్లో ఉంటూ
తనదైన శైలిలో దూసుకుపోయి సొంత మనుషులపై
కూడా విరుచుకుపడే నైజం ఆయనకే సొంతం. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక పలువురు క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతున్నారు. అధికార పార్టీ నేతగా ఉంటూ మంత్రి హోదాలో వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న తీరు వివాదాలకు తావిస్తోంది. దీంతో చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరిపోతున్నారు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గం పలాసలో గురుదాసుపురం పంచాయతీలో నలుగురు వలంటీర్లు తమ పోస్టును వదులుకుని, టీడీపీలోకి చేరిపోయారు. వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ పలాస నియోజకవర్గ ఇంఛార్జ్ గౌతు శిరీష. వాస్తవానికి గత కొద్ది కాలంగా మంత్రి సీదిరితో సహా ఆయన మనుషుల నడవడి నచ్చక చాలామంది పార్టీ మారిపోవాలనే చూస్తున్నారు.
గౌతు శివాజీ నేతృత్వంలో గతంలో టీడీపీ బాగానే ఇక్కడ పట్టు పెంచుకుంది. కానీ వైసీపీ హవాలో కాస్త తడబడి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో ఇక్కడ డాక్టర్ గా ఉంటూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో సేవలందిస్తున్న సీదిరి అప్పల్రాజు సీన్ లో కి వచ్చారు. అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు అటుపై మంత్రి కూడా అయ్యారు. మత్స్య శాఖ వ్యవహారాలను ప్రస్తుతం చూస్తున్నారు. జగన్ కు వీర విధేయుడు. సరిహద్దు (ఆంధ్రా - ఒడిశా) తగాదాలు తీర్చడంలోనూ ముందుంటున్న వ్యక్తి కూడా ఆయనే! కానీ ఆయన శైలి తో పాటు ఆయన భార్య ప్రవర్తన పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి.
నియోజకవర్గ బాగు ఎలానూ లేదు కానీ కనీసం కార్యకర్తలతో నడుచుకునే రీతి అయినా మార్చుకోవాలంటూ పలువురు సూచిస్తున్నా ఇవేవీ పట్టించుకునే స్థితిలో మంత్రి లేరు. దీంతో వివాదాలు పెరిగి పెద్దవయ్యి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి లాభం ఇచ్చేలానే ఉన్నాయి.