ఏపీ రాజకీయాల్లో మళ్లీ తారక్ మంత్రం...!
చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు మీటింగ్ లు పెడుతుంటే ... అక్కడకు వచ్చిన కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ విడుదలైన సందర్భంగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా రచ్చ చేయడంతో పాటు కాబోయే సీఎం తారక్ అంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు.
చివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సైతం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు... అంటే వీరికి కూడా చంద్రబాబు , లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేదా ? ఎన్టీఆర్ కష్టకాలంలో పార్టీ లోకి వస్తే పార్టీకి కాస్త ఊపు వస్తుందని అంటున్నారా ? అన్న దానిపై పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్ నడుస్తోంది.
మరోవైపు చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికలకు ముందుగానే తన తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలంగా ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరి లోకేష్ ను ఎలా ప్రొజెక్ట్ చేస్తారా ? వచ్చే ఎన్నికల నాటికి ఎలా పుంజుకుంటారన్నదే చూడాలి.