జగన్ టీమ్‌ సక్సస్‌: ఉద్యోగుల సమ్మె వాయిదా..?

Chakravarthi Kalyan
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు పాక్షికంగా ఫలించాయి. ప్రభుత్వం తమ సమస్యల పై సానుకూలంగా స్పందించిందన్న ఉద్యోగ సంఘాలు సమ్మను తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అంగీకరించాయి. మొత్తం 71 అంశాలపై కూలంకషంగా చర్చించామని.. రాత పూర్వకంగా హామీ ఇస్తామని ఇచ్చిన కారణంగా ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.


తాము దురుద్ధేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్ళలేదన్న బొప్పరాజు.. ఇవాళ జరిగిన సమావేశం మినిట్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. డిసెంబర్ 7 తేదీ నుంచి ఉద్యోగులు అంతా ఆందోళనలో ఉన్నారని.. ఇప్పుడు తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కారణంగా ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.


ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పెండింగ్ అంశాలపై చర్చలు జరిపామన్నారు. రెండు జేఏసీలతోనూ మాట్లాడామని.. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని తెలిపారు. కొవిడ్ తో పాటు అనేక అంశాల వల్ల ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం ఆలస్యమైందన్న బుగ్గన.. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం అని.. ఉద్యోగులు కూడా అందులో భాగమని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన హామీ ఇచ్చారు.


దశల వారీగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని.. బుధవారం సీఎస్ తో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని బుగ్గన అన్నారు. తాను స్వయంగా పర్యవేక్షిస్తానని.. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందువల్ల 9 సంఘాలు ఉద్యమం విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఫైనల్‌గా జగన్ టీం ఏం చేస్తుందో కానీ.. ప్రస్తుతానికైతే ఇరు పక్షాల మధ్య వాతావరణం బాగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: