ఆ పంట వేస్తే రైతుబంధు కట్.. కానుందా..!

MOHAN BABU
 గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు వేసే పంటలపై తీవ్రమైన రాజకీయం జరుగుతోంది. ఓవైపు పంట కొనుగోలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం అడుగుతుంటే, కేంద్రం మేము కొనబోమని  తెగేసి చెబుతోంది. ఈ విధంగా ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ మధ్యలో రైతులను సతమతం చేస్తున్నారు. ఈ దశలోనే తెలంగాణ ప్రభుత్వం వరి వేయ వద్దంటూ అనేక ఆంక్షలు పెడుతోంది. వరి వేస్తే ఉరే అన్న విధంగా ప్రవర్తిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఇంత చెబుతున్నా రైతులు మాత్రం మళ్లీ వరి వేయడానికి సిద్ధమవుతున్నట్టు  తెలుస్తోంది.


దీంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖను కొన్ని నిబంధనలు పంపినట్టు సమాచారం. ఒకవేళ వరి పంట వేస్తే  రైతుబంధు కట్ చేయాలనే యోచనలో  ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రైతులు మాత్రం రైతుబంధు కోసం వరి వేయడం లేదు. రైతుబంధు ఇచ్చినా ఇవ్వకపోయినా  వారికి వారి భూమిలో ఏ పంట వేయాలో, ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందో ప్రభుత్వాలు చెప్పాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు వరి వేసే రైతులకు రైతుబంధు  నిలిపి వేయాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసే వారికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రైతు వరి వేయడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి ఆయా నేలలు, మరొకటి 24 గంటల  కరెంటు , మరో ముఖ్య కారణం నీరు సమృద్ధిగా ఉండడం, ఇవన్నీ ఉండగా పొలాలలో ప్రత్యామ్నాయ పంటలు ఎలా పండుతాయి అని  రైతులు వాపోతున్నారు. నీరు సమృద్ధిగా ఉండటం వల్లనే  వరి సేద్యం విపరీతంగా పెరిగి దేశంలోని వరిసాగులో మొదటి ప్లేస్ లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం చాలా గర్వంగా తెలంగాణ రాష్ట్రం వరిసాగులో ముందుందని చెప్పుకొచ్చింది. మరి ఆ సమయంలో అన్నదాత వేసిన వరి ఎందుకు కావలసి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు. చిన్న సమస్య రాగానే తప్పంతా రైతుది అన్నట్టు వ్యవహరిస్తే ఎలా..? సమస్య ఎక్కడుందో తెలుసుకోకుండా తప్ప అంతా రైతులదే అనడం అనాలోచిత చర్య. అయితే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసేవారు.


అన్ని రకాల పప్పులు  పండించేవారు. ఆ సమయంలో వాళ్ళు ఇంట్లోకి మిగిలిపోను మిగతా పంటను అమ్ముకునేవారు. దీంతో పాటు పాడి పరిశ్రమ కూడా అధికంగా ఉండేది. అలా వ్యవసాయం చేసే రైతులను పూర్తిగా వరి వైపు మళ్ళించి, మళ్లీ ప్రత్యామ్నాయ పంటలు ప్రతిపాదించడం ఎంతవరకు కరెక్టు. రైతుకు ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదు  ప్రభుత్వాలు చెప్తేనే వేస్తున్నారా. వారికి తెలియదా అనేది ప్రస్తుతం రైతుల మెదళ్ళలో మెదులుతున్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: