చంద్రబాబుకు అగ్రనేతల షాక్
అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన బహిరంగసభ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మూడుపార్టీల అగ్రనేతలు పెద్ద షాకే ఇచ్చారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కంటిన్యుచేయాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. తమ యాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో పెద్ద బహిరంగసభ జరిగింది. అమరావతికి అధికారపార్టీ తప్ప మిగిలిన అన్నీ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వాలని టీడీపీ ముసుగులో అమరావతి జేఏసీ నిర్వాహకులు చాలా కష్టపడ్డారు.
పైకి కనబడుతున్నది అమరావతి జేఏసీనే కానీ మొత్తం వ్యవహారాన్ని నడిపింది టీడీపీయే అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు బ్యాకప్ తోనే దీక్షలైనా, పాదయాత్రైనా, బహిరంగసభ అయినా జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఈ బహిరంగసభకు ప్రతిపక్షాలన్నింటినీ పిలిచారు. ప్రతిపక్షాల రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు తప్పకుండా రావాలని కూడా కోరారు. అయితే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఎం కార్యదర్శి మధు మాత్రం బహిరంగసభకు హాజరుకాలేదు.
వీర్రాజు, పవన్ కూడా బహిరంగసభకు హాజరవుతారని చంద్రబాబుతో చేతులు కలుపుతారని బాగా ప్రచారం జరిగింది. వీర్రాజు, పవన్ బహిరంగసభకు హాజరవ్వటం చంద్రబాబుకు చాలా అవసరం. ఎందుకంటే పొత్తుల కోసం చంద్రబాబు అల్లలాడుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేంత సీన్ చంద్రబాబు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీలైతే బీజేపీ, జనసేనలతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు.