ఏం మనుషులు..! పొట్టకూటి కోసం వస్తే కొట్టి చంపేస్తారా..?

Chakravarthi Kalyan
ఉత్తరాది నుంచి తెలుగు రాష్ట్రాలకు అనేక మంది వలస కూలీలు వస్తుంటారు. వారిలో చాలా మంది నిరక్ష్యరాశ్యులు.. పుట్టిన రాష్ట్రంలో ఉపాధి లేక.. పెళ్లాం పిల్లలను పోషించుకునేందుకు వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి తెలుగు రాష్ట్రాలకు వస్తుంటారు. వారి కష్టాలు వర్ణనాతీతం.. అయితే అలాంటి వలస కార్మికుల పట్ల కొన్నిసార్లు దారుణంగా వ్యవహారిస్తున్నారు స్థానికులు. ఏమాత్రం అనుమానం వచ్చినా దాడి చేస్తున్నారు.. తాజాగా కూకట్ పల్లి హౌజింగ్‌ బోర్డులో జరిగిన ఓ సంఘటన వలసకూలీల దుస్థితికి అద్దం పడుతోంది.


రాజేశ్ అనే కార్మికుడు ఒడిశా నుంచి వచ్చి బాచుపల్లిలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. బుధవారం రాత్రి బిరియానీ తిందామని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. అయితే అక్కడ సెల్లార్‌లో రెస్టారెంట్ సిబ్బంది కొందరు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. రాజేశ్‌ ను అతడిని చూసి రెస్టారెంట్ సిబ్బంది దొంగగా భావించారు. ఏవో ప్రశ్నలు అడిగారు.. రాజేశ్‌ వైఖరిపై అనుమానం వచ్చిన రెస్టారెంట్ సిబ్బంది సెల్లార్‌లో దారుణంగా కొట్టేశారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఒడిశా కార్మికుడు రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.


రాజేశ్‌ను దారుణంగా కొట్టిన సిబ్బంది కనీసం చనిపోయాడా.. బతికాడా అన్న విషయం కూడా పట్టించుకోలేదు. రాత్రంతా గాయాలతోనే అల్లాడిన రాజేశ్‌ గురించి ఉదయం అతని భార్యకు కొందరు సమాచారం ఇచ్చారు. లబోదిబోమంటూ వచ్చిన అతని భార్య.. చేతిలో సొమ్ములు లేకపోవడంతో  అతన్ని కనీసం ఆసుపత్రి కూడా తీసుకెళ్లలేకపోయింది. అలాగే ఇంటికి తీసుకెళ్లింది. మొన్న ఉదయం గాయాలతో రాజేశ్ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భావించిన రాజేశ్ భార్యకు అక్కడా తిప్పలు తప్పలేదు.


రాజేశ్ భార్య మొదట మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు అది తమ పరిధి కాదంటూ కేపీహెచ్‌బీ ఠాణాకు వెళ్లాలని చెప్పారు. మృతుడు రాజేశ్ భార్య ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: