సంచ‌ల‌నం : కేసీఆర్ పై జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌లు..?

N ANJANEYULU
ప్రముఖ న్యాయవాది, మద్రాస్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మ‌రొక‌సారి వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌ల  సూర్య నటించిన జై భీమ్ సినిమా తర్వాత‌ తెలుగు ప్రేక్షకులకు కూడా  చంద్రు పరిచయమ‌య్యారు . దళిత మహిళ పట్ల పోరాడిన చంద్రు నిజ జీవితం ఆధారంగానే జై భీమ్ సినిమాను చిత్రీక‌రించారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షం, జగన్ సర్కార్ పై ప్రజల్లో క‌న్నా.. కోర్టుల్లో ఎక్కువగా పోరాడుతోందని చంద్రు  సంచ‌ల‌న కామెంట్స్ చేసారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ది.

 తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పై జ‌స్టిస్ చంద్రు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇవాళ హైద‌రాబాద్ బాగ్ లింగంప‌ల్లిలోని సుంద‌ర‌య్య క‌ళానిల‌యంలో విధ్వంస‌మ‌వుతున్న ప్ర‌జాస్వామ్య పునాదులు- ప‌రిర‌క్ష‌ణ మార్గాలు అనే అంశంపై నిర్వ‌హించిన స‌ద‌స్సులో రిటైర్డ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్రు పాల్గొని మాట్లాడారు.

 ప్ర‌జా వ్య‌తిరేకంగా మాట్లాడితే సీఎం కేసీఆర్, జ‌య‌ల‌లిత లాంటి వారు ఎన్నో రోజులు అధికారంలో ఉండ‌రు అని.. ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో తెలంగాణ సీఎం తీరు విస్మ‌యానికి గురి చేసింద‌న్నారు. స‌మ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తా అంటూ బెదిరించార‌ని గుర్తు చేసారు.  తాను యూనియ‌న్ల‌తో మాట్ల‌డ‌ను అని ప్ర‌క‌టించార‌ని.. యూనియ‌న్‌ల‌తో కాకుండా ఉద్యోగుల‌తో మాత్ర‌మే మాట్లాడుతా అన‌డ‌మేమిట‌ని జ‌స్టిస్ చంద్రు ప్ర‌శ్నించారు.

దేశంలో కార్మిక సంఘాలు ఉన్నాయ‌ని.. ఇక మీద కూడా ఉంటాయ‌ని, స‌మ‌స్య‌లపై యూనియ‌న్‌ల‌తోనే మాట్లాడాల‌ని పేర్కొన్నారు జ‌స్టిస్ చంద్రు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు వ్య‌తిరేకంగా వెళ్లితే.. ఎన్నో రోజులు కేసీఆర్ అధికారంలో ఉండ‌లేరు అని వెల్ల‌డించారు.  జై భీమ్ సినిమా త‌న‌కు ఒక కొత్త గుర్తింపు కార్డును తీసుకొచ్చింద‌ని జ‌స్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఆ సినిమా త‌రువాత త‌న‌కు దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఆహ్వానాలు కూడా అందాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేసారు.



 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: