Jagan @ 49 : విశిష్ట వ్యక్తికి విభిన్నత అవసరం? ఎందుకంటే...
చాప కింద నీరులా
చాలా జరుగుతాయి
కానీ వీటిని అడ్డుకోవడం
ఓ సీఎం హోదాలో ఉన్న
వ్యక్తి బాధ్యత
వాసన్న (బాలినేని శ్రీనివాస్ రెడ్డి)
దాసన్న (డిప్యూటీ సీఎం ధర్మాన)
ఇలాంటి వారే రాజ్యాన్ని నడుపుతారు
వారికి అండగా పెద్దిరెడ్డి పెద్ద దిక్కు
అయి నిలుస్తారు అయినా కానీ
మనం మాత్రం ఏమీ అనకూడదు
వ్యవహార శైలిపై విమర్శా పత్రం రాయకూడదు
ఎనీవే ఇవాళ మీ పుట్టిన్రోజు కనుక
బాధ్యతాయుతమయిన ఈ 4 మాటలు చదవండి చాలు
ఆచరణ అన్నది పెద్ద పదం.. రాజ్యం వాదనకు
ఇటువంటివి చెల్లవు!
రౌడీలూ గూండాలూ లేని రాజ్యాన్ని కోరుకోవడంలో తప్పేం లేదు. ఈ పాటి కోరుకోవడంలో ఈనాడు మీడియా కానీ మరో మీడియా కానీ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది కూడా! అందుకే జగన్ హయాంలో రౌడీయిజం ఉండొద్దు అని అనుకుంటూ అనుకుంటూ ప్రజలు శతకోటి దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. పాలనపై ఎలానూ అధ్యయనం లేదు.. పునరావలోకనం లేదు కనీసం రౌడీలను అయినా అడ్డుకోలేరా?
బలమైన పార్టీని ఢీ కొన్న శక్తి జగన్ ది. రాజకీయంలో భాగంగా ఆయనకు ఎదురుగా నిలిచిన వారంతా తరువాత తప్పుకున్నారు. ఇప్పుడు మంత్రులెవ్వరూ మాట్లాడేందుకు వీలే లేకుండా ఉంది. బాలినేని లాంటి పెద్దలు వారి మనుషులు ఇవాళ ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా నడుచుకుంటున్నారో విధితమే! దేవాలయంలో బూతులు వింటూ వింటూ మనం ఆగిపోవాలి. అంతేకానీ అసెంబ్లీ గురించి ఏం మాట్లాడకూడదు. మనం అంతా ఒక అనిశ్చితిలో ఉంటూ జయహో వైఎస్సార్ కాంగ్రెస్ అని మాత్రమే పలికి తప్పుకోవాలి. ఆ రోజు పాదయాత్రలో జగన్ చాలా బాగున్నారు అనగా నడవడి రీత్యా! ఆయనను నమ్మేందుకు కొన్ని పరిణామా లు సహకరించాయి కూడా! కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇకపై ఈ విధంగానే పాలన ఉంటే ఏం చెప్పలేం కూడా!
దాదాపు పదేళ్ల కష్టం ఫలితంగా వైఎస్సార్ అబ్బాయి రాజకీయంగా నిలదొక్కుకునేందుకో అవకాశం దక్కింది. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎదుగుదలను అడ్డుకునే శక్తులు ఆ వేళ అడుగడుగునా ఉ న్నాయి. అవే శక్తులు ఇవాళ ఆయనతో కలిసి రాజకీయం చేస్తున్నాయి. వినేందుకు ఇదేం పెద్ద విషయం కాకున్నా నవ్వుకునేం దుకు ఇలాంటివి ఎన్నో ఉపయోగపడతాయి. జగన్ కు పాలనా దక్షతపై ఎటువంటి అవగాహనా లేదు అన్నది ఎప్పుడో తేలిపో యింది. అంతేకాదు ఆయనకు స్పష్టత కొరవడిన కారణంగానే రాష్ట్రాభివృద్ధి ఎటువంటి పురోగతినీ పొందక ఉందన్నదీ స్పష్టం అయిపోయింది. రెండున్నరేళ్ల పాలన తరువాత కూడా అధికార యంత్రాంగంపై పట్టు లేకపోవడం ఓ విధంగా సీఎం జగన్ చేస్తున్న తప్పిదాలకు ఓ తార్కాణం. లేదా ఉదాసీన వైఖరికో తార్కాణం.
నాన్న నుంచి వారసత్వంగా అందుకున్న రాజకీయం అదే రంగం నుంచి ఎదిగివచ్చిన వైనం ఇవన్నీ ఇవాళ పుట్టిన్రోజు జరుపుకుం టున్న వ్యక్తి ప్రత్యేక శక్తి. అవును! యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేర్చుకోవాల్సింది..నిలువరించాల్సింది ఎంతో! పాదయాత్రతో రాష్ట్ర చరిత్రలోనే కలికితురాయిగా నిలిచిన నాటి సందర్భాలు అన్నీ బాగున్నాయి. ఆ రోజు ప్రజల బాధలను అర్థం చేసుకున్న తీరు బాగుంది. వాటికి అనుగుణంగా ఇచ్చిన హామీలు బాగున్నాయి. మా ఏడు రోడ్ల కూడలికి వచ్చి ఆయన చెప్పిన మాటలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్నీ ఆర్థిక సంబంధం అయిన హామీలు. వీటిపై ఆయనకు ఉన్న స్పష్టత ఎంతన్నది అటుంచితే అసలీవాళ ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయిలో ఉందా? ఉంచాల్సిన బాధ్యత ఎవరిది?
- రత్నకిశోర్ శంభుమహంతి