మోడీ : మన తగువులతో ఆయనకేం పని?
కానీ మోడీ మాత్రం
ఏమీ పట్టని విధంగా పైకి నవ్వులు
చిందించి రెండు తెలుగు రాష్ట్రాలకూ
అన్యాయం ఒకటి చేస్తూ
అభివృద్ధిని మాత్రం పరుగులు తీయనీయక
చేస్తున్నారు అన్నది ఓ చేదు నిజం
విభజన చట్టం మొదలుకుని చాలా వివాదాల్లో మోడీ మనకు చేసిన సాయం లేదు. ఏడేళ్ల కాలంలో ఆయనకు మనకు చేసింది ఏం లేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల పెద్దలు కేంద్రాన్ని ఏమీ అనరు అడగరు. అడగరు అంటే అందుకు కారణం కూడా వారి వారి ఆర్థిక నేరాలు మరియు రాజకీయ అవసరాలు అంతటి స్థాయిలో అక్కడ పోగయి ఉన్నాయి. అదేవిధంగా కాస్తో కూస్తో తెలంగాణ కొన్ని విషయాల్లో వ్యతిరేకతతో పైకి మాట్లాడినా మన ఆంధ్రా వైసీపీ ఎంపీలు మోడీ అడిగినా అడగకపోయినా వివాదాస్పద బిల్లులకు మాత్రం మద్దతు ఇచ్చి మోడీ కి ఆప్తమిత్రులం తామే అని చెప్పుకునేందుకు అత్యుత్సాహం ఒకటి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటారు.
ఆంధ్రావని రాజకీయాల్లో మోడీ తలదూర్చరు ఎందుకంటే ఇక్కడ బీజేపీ అంత బలంగా లేదని తేలిపోయింది అలానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తగువుల్లో కూడా తలదూర్చరు ఎందుకంటే అది కూడా ఆయనకు సంబంధం లేదు. ఏం జరిగినా మోడీ చూస్తూ ఉంటారు. చూడడం వినడం మాట్లాడకపోవడం అన్నవి చాలా ఇష్టమయిన పనులు ఆయనకు. వీటికి మాత్రం ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ స్పందన లేదు. ఆదాయం ఉన్నా లేకున్నా తెలుగు రాష్ట్రాలను పట్టించుకునే తీరుబాటే ఆయనకు లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కి అంత సీన్ లేదని ఎప్పుడో అర్థం అయిపోయినందుకే మోడీ ఇలా వ్యవస్థల దిద్దుబాటుకు ముందుకు రావడం లేదని కూడా తేలిపోయింద. కేంద్రం అంటే పెద్దన్న అని అంటారు సాధారణంగా! కానీ
మన అదృష్టమో దురదృష్టమో పెద్దన్న మాత్రం పెద్దగా మాట్లాడరు. మౌనం వహించి ఇరు రాష్ట్రాలకూ నీతులు మాత్రం ఎప్పటికప్పుడు మన్ కీ బాత్ రూపంలో వినిపించి వెళ్లడం ఆయనకో ఆనవాయితీ!