అమరావతి : చంద్రబాబును కలవరపెడుతున్న సమస్య
గడచిన రెండున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడును ఒక సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. ఇంతకీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అంతగా కలవరపెడుతున్న సమస్య ఏమిటంటే నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించటం. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇన్చార్జిల సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ఇదే అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. ఇపుడు చంద్రబాబును బాగా కలవరపెడుతున్న సమస్యిదే.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించే నిరసన, ఆందోళన కార్యక్రమాలను సక్సెస్ చేయాలంటే ఇన్చార్జిలదే కీలకపాత్ర. ఇన్చార్జిలు ఎంత గట్టిగా పనిచేస్తే పార్టీ అంతగా జనాల్లో చొచ్చుకుపోతుంది. కానీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 100 నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి ఇన్చార్జిలు లేరు. ఇదే విషయమై పార్టీ ఆఫీసులో చంద్రబాబు కసరత్తు మొదలైన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎంత డొల్లగా ఉందో అర్ధమైంది.
ఇక్కడ సమస్యఏమిటంటే ఇన్చార్జిలుగా ఉన్నవారు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకోవటంలేదు. అలాగే ఇన్చార్జి పదవులను మరొకరికి వదిలిపెట్టడంలేదు. ఇదే సమయంలో పార్టీకానీ అధినేతకు కానీ అందుబాటులో ఉండటంలేదు. దాంతో అలాంటి నియోజకవర్గాల్లో పార్టీకి పెద్దదిక్కు లేకుండా అనాదగా మారిపోయింది. చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులేనే తంబళ్ళపల్లి, సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరిలో పార్టీ ఇబ్బందులు పడుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, కాకినాడ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల సమీక్షల్లో ఇలాంటి సమస్యలు చాలానే బయటపడ్డాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు నియోజకవర్గాల్లో ఉండకుండా బయటెక్కడో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. పోనీ ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అంటే అదీలేదు. దాంతో ఇలాంటి వాళ్ళ విషయంలో స్ధానిక నేతల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇన్చార్జిలన్న వాళ్ళే అందుబాటులో లేకపోవటంతో ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ కూడా స్తబ్దుగా మారిపోతున్నారు.
ఇన్చార్జిల విషయాలను వీలైనంత తొందరగా ఫైనల్ చేసేయాలని చంద్రబాబు మీటింగ్ పెడితే ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఎందుకంటే పార్టీకి అందుబాటులో ఉండని నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇన్చార్జిలను మార్చాలని మెజారిటి నేతలు గట్టిగా చెప్పినా కాదు తామే ఉంటామని ఇన్చార్జిలు చెప్పారట.