కేటీఆర్ కొడుకుపై కామెంట్స్: తీన్మార్ మల్లన్నపై దాడి..?
జేపీ నడ్డా గారూ.. మీరు మీ నాయకులకు ఇదే నేర్పిస్తున్నారా.. అని జేపీ నడ్డాను కేటీఆర్ నిలదీశారు. మీ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు నా కొడుకుని రాజకీయాల్లోకి లాగడం సంస్కారమా.. అతన్ని బాడీ షేమింగ్ చేయడం ఏం సంస్కారం అంటూ ప్రశ్నించారు. మీ నాయకులు ఇలాంటి పోస్టులు పెడితే.. దీనికి స్పందనగా మేం అమిత్ షా, మోడీ కుటుంబాలపై పోస్టులు పెడతామని మాత్రం అనుకోవద్దు అంటూ తనకు సంస్కారం ఉందని పరోక్షంగా గుర్తు చేశారు కేటీఆర్.
ఈ విషయంపై కేటీఆర్ పెట్టిన పోస్టు విషయం పార్టీ వర్గాల్లో బాగానే పాకిపోయింది. దీంతో ఆగ్రహించిన కొందరు టీఆర్ఎస్ నాయకులు.. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్లో అడ్డగోలుగా పోస్టు పెడతావా అంటూ ఆగ్రహించారు. కొంతమంది టీఆర్ఎస్ సానుభూతిపరులు ఏకంగా తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలోని శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో తీన్మార్ మల్లన్న ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.
ముందు తీన్మార్ మల్లన్నతో వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి ఆ తర్వాత మల్లన్నపై దాడి చేశారు. ఈ ఘటనపై రాజ్‌కుమార్ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న కొంత కాలంగా కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ తన మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం.. వాస్తవాల ఆధారంగా ఉండాలి తప్ప.. ఇలా బాడీ షేమింగ్ తరహాలో ఉండటం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు.