వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు రంకెలేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీలన్ని వరుస ప్రచారాలు, సభల, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. 2022 అసెంబ్లీ ఎన్నికల రూపంలో కసరత్తులు మొదలయ్యాయి.
దీంతో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ అంది దృష్టి యూపీ పైనే పడింది. దేశంలోనే అత్యధికంగా లోక్సభ స్థానాలు యూపీలో ఉండడంతో..కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ బీజేపీని ఎలాగైన ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే, బీజేపీ-సమాజ్ వాద్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశ వ్యాప్తంగా బీజేపీ పై, రాష్ట్రంలో యోగి పాలనపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు.. వ్యవసాయ చట్టాల రద్దు, కాశీ కారిడార్, అయోధ్య రాము మందిర నిర్మాణం వేగవంతం వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి మొదలు బీజేపీ అగ్రనేతలందరూ యూపీని చుట్టేస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో తమ ప్రభావం ఎలాగైన చూపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీని కోసం ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ తరువాత రెండో స్థానంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యూహాలు పన్నుతోంది. దీంతో యూపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.