కేంద్ర ఆరోగ్య శాఖ నోట ఫోర్త్ వేవ్ మాట..!
దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసులపై కేంద్రం అధ్యయనం చేసింది. మొత్తం 183 ఒమిక్రాన్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆక్తికరమైన విషయం వెల్లడైంది. ఆ ఒమిక్రాన్ రోగుల్లో ప్రతి 10మందిలో 9మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొంది. అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరం, కర్ణాటక, బిహార్, పంజాబ్ లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో టెస్టులు పెంచాలని సూచించింది.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా బూస్టర్ డోస్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 3వేల మందిపై అధ్యయనం చేయనుండగా.. హర్యానాలోని ట్రాన్స్ లేషన్ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఇది సాగనుంది. పలు దేశాల్లో బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వగా.. మన దేశంలోనూ అనుమతి ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
ఇక దేశంలో గత 24గంటల్లో 7వేల 189కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 387మంది కోవిడ్ వల్ల మృతి చెందారు. నిన్న 7వేల 286 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 77వేల 32యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 415మందికి ఒమిక్రాన్ సోకినట్టు పేర్కొంది. వారిలో 115మంది కోలుకున్నట్టు వెల్లడించింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రపంచం కరోనా ఫోర్త్ వేవ్ చూస్తోందని ఆరోగ్య శాక చెబుతోంది.