తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ. నిజాం ప్రభుత్వ అరాచకాలకు, పటేల్ పట్వారీల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొన్నితరాల వారసత్వం వారిది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో కేసీఆర్కు ప్రధానంగా ఉపయోగపడింది వారి పోరాట తత్వమే. అన్యాయం జరుగుతోందంటే ప్రాణాలకు తెగించి కొట్లాడే తెలంగాణ ప్రజల సహజ నైజం ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల అత్యుత్సాహం కారణంగా అదే కేసీఆర్కు ఎదురు నిలుస్తున్నట్టు కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కొంతకాలం క్రితం వరకు చాలామందికి తెలియదు. ఓ మీడియా ప్రతినిధి అంతే. ఆ తర్వాత ఓ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజా సమస్యలను వెలికి తీస్తూ, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కాస్త ఘాటైన పద్ధతిలో ఎత్తిచూపుతూ తెలంగాణ యువతలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు..కొంతకాలం క్రితం తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పని చేశాడు. ఆ తరువాత అతడో ప్రజా నాయకుడిగా మారిపోయాడు.
ఈ నేపథ్యంలోనే అతడిపైనా, అతడి మీడియా ఆఫీసుపైనా గతంలో దాడులు జరిగాయి. ఇవి టీఆర్ఎస్ ప్రభుత్వమే చేయించిందని మల్లన్నఆరోపించాడు. ఆ తర్వాత పలు కారణాలు చూపుతూ మల్లన్నను టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. రెండునెలలపాటు జైలులో ఉండి విడుదలయ్యాక మల్లన్న ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింత పెంచాడు. అంతేకాదు.. బీజేపీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ అండ దొరికింది కాబట్టి అతడి వాయిస్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇతర మీడియాల్లోను అతడి పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మల్లన్న.. ప్రభుత్వంపై చేసిన విమర్శల్లోకేటీఆర్ కుమారుడు హిమాన్ష్ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడాడంటూ మల్లన్న ఉన్న పత్రికా కార్యాలయంపై కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇప్పుడు దీన్ని తీన్మార్ మల్లన్న ఆయుధంగా మలచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ మల్లన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పుంటే టీఆర్ఎస్ నాయకులు దానిని ఎత్తిచూపి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగి ఉండేది. మల్లన్నకు మైలేజీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేసీఆర్ అధికారం లోకి వచ్చాక విమర్శలను ఏమాత్రం సహించలేని ఫ్యూడలిస్టు మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి తీసుకువెళ్లడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఒకరకంగా మల్లన్న రాజకీయంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ పార్టీయే బాటలు పరుస్తోందని చెప్పాలేమో..!