తమిళనాట దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ ఇమజ్‌తో కొనసాగుతున్న మేటి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ లకు ఉన్న ప్రత్యేకత వేరు. వీరిద్దరిమధ్యన ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అంతేకాదు.. కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ కలసి నటించారు కూడా. దక్షిణాదిన విజయం సాధించడమే కాకుండా చాలా ఏళ్ల క్రితమే బాలీవుడ్‌లో నటించి ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఘనత వీరిది. ఇక కోలీవుడ్‌లో విపరీతమై మాస్ ఇమేజ్ సంపాదించుకున్న రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతాడని ఎప్పటినుంచో ఊహాగానాలు వెలువడటం, దానికి అభిమానుల వైపు నుంచి ఏర్పాట్లు చేసుకోవడం, అంతలోనే ఏమైందో ఏమో అంతిమంగా ఆ ప్రయత్నం విరమించుకోవడం ఇప్పటికే జరిగిపోయాయి. అయితే ఇదే సమయంలో ఎవరూ ఊహించనివిధంగా గత అసెంబ్లీ ఎన్నకల ముందు తమిళనాట కమల్‌హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం మాత్రమే కాదు.. మక్కల్ నీది మయ్యం పేరున సొంతంగా పార్టీ పెట్టడం, పోటీలోకి దిగడం శరవేగంగా జరిగిపోయాయి. అయితే ఈ ఎన్నికలు కమల్‌కు చేదు ఫలితాన్నే ఇచ్చాయి. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి స్వయంగా బరిలోకి దిగిన కమల్ హాసన్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.
ఇక రజనీకాంత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేకపోవడం, గతంలోనే పార్టీ పెట్టి కొన్నాళ్లు రాజకీయంగా పోరాడినా ఆశించిన ఫలితం లేక విరమించుకున్న విజయకాంత్ ల ఉదంతాలను పరిశీలిస్తే, ప్రస్తుతం తమిళ సినీరంగం నుంచి రాజకీయాల్లో ఏక్టివ్‌గా ఉన్నది కమల్‌హాసన్ మాత్రమేనని చెప్పాలి. అయితే ఆయన స్థాయికి తగిన విజయం రాజకీయాల్లో దక్కకపోవడంతో కమల్ సొంత పార్టీని కొనసాగిస్తారా..? లేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీని తమిళనాట మెరుగైన స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తారా అన్నవిశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీలో ఆయన చేరే అవకాశం లేదన్నది మాత్రం స్పష్టమే. ఇక ఇటు సినిమాల్లోనూ కమల్‌కు కాలం కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆయన హీరోగా మొదలైన భారతీయుడు-2 షూటింగ్ ప్రమాదం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.