ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ ఉరుముతోంది. ఇప్పటికే యూరోపియన్ దేశాలు, అమెరికా లోని పలు రాష్ట్రాల్లో దీని ఉధృతి పెరుగుతుండగా బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యలో రోజు వారీ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ పుట్టినిల్లుగా చెపుతున్నచైనాలో జియాన్ నగరం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇక భారత్‌లోనూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల వ్యాప్తిని నివారించేందుకు సోమవారం నుంచి రాత్రి సమయాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో కోవిడ్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజులోనే నగరంలో 922 కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజువారీగా చూస్తే గత ఏడు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. ప్రస్తుతం ముంబయిలో ఏక్టివ్ కేసుల సంఖ్య 4వేలకు పైగానే ఉంది. ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి ముంబయ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఇద్దరు వ్యక్తులు కోవిడ్ తో చనిపోయారు. మరోవైపు పాజిటివిటీ కూడా 2.6 శాతానికి పైగా నమోదవుతుండటంపై వైద్య వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లా టక్రీ ధోకేశ్వర్‌లో ఓ పాఠశాలలో 52మంది విద్యార్థులు వైరస్ ప్రభావానికి గురవడంతో ఆ పాఠశాలను సీజ్ చేసి, ఆ ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ నమోదయ్యాయి.
కాగా సామాన్య ప్రజల్లో కోవిడ్ పూర్తిగా అంతరించినట్టేనన్న భావం పెరగడం, కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా తిరగడం, పర్యాటక ప్రాంతాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే కోవిడ్ మరోసారి పంజా విసురుతోందని అధికార వర్గాలు చెపుతున్నాయి. కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే ముంబయితో సహా మరికొన్ని నగరాల్లోనూ మళ్లీ లాక్‌డౌన్ తరహా ఆంక్షలు తప్పవని, అదే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు కోలుకోలేని పరిస్థితికి దారితీయవచ్చన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ రెండోవేవ్ నాటితో పోలిస్తే దేశంలో ఇప్పుడు వ్యాక్సినేషన్ అయినవారి సంఖ్య ఎన్నోరెట్లు అధికం కావడంతో అంతటి ముప్పు ఉండకపోవచ్చని నిపుణులంటూ ఉండగా, ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే ముప్పునుంచి బయటపడే అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నివారణకు వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయోననే పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికారణంగా మరణాల శాతం పెద్దగా ఉండకపోవచ్చన్న విశ్లేషణలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.