ఒమిక్రాన్‌ టెర్రర్‌: ఆ ఎన్నికలు జరుగుతాయా..?

Chakravarthi Kalyan
దేశంలో ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కరోనాలోని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ అనేక దేశాల్లో తన సత్తా చాటుతోంది. ఫ్రాన్స్ వంటి దేశంలో రోజుకు కొత్తగా లక్ష కేసుల వరకూ వెలుగు చూస్తున్నాయి. ఇండియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ అడుగు పెట్టిన కొన్నిరోజుల్లోనే ఇప్పటికే కేసులు 500కు పైగా చేరుకున్నాయి.


ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇండియాలో థర్డ్ వేవ్ ఫిబ్రవరి నాటికి పీక్స్ లో ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఫిబ్రవరి, మార్చ్‌లలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సీఈసీ సన్నాహాలు చేసుకుంటోంది. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అవుతోంది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై చర్చంచబోతోంది. వచ్చే ఏడాదిలో జరగనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై ఒమిక్రాన్ ప్రభావం గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది.


వచ్చే ఏడాదిలో గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌ అసెంబ్లీలకు  ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని కొవిడ్‌, ఒమిక్రాన్‌ వ్యాప్తి గురించి సమాచారం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గతేడాది కూడా ఎన్నికల సమయంలో కరోనా బాగా వ్యాపించింది. ఇప్పుడు వచ్చింది ఏకంగా ఒమిక్రాన్‌.. మరి ఈసారి కూడా గతంలో తరహాలోనే ఎన్నికలు జరుపుతారా.. లేక.. ఒమిక్రాన్ జోరు చూసి నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.  


అయితే.. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా గతంలో మాదిరిగానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ జోరుందుకోవడం.. పిల్లకు కూడా టీకా అందుబాటులోకి రావడం.. బూస్టర్ డోసులు కూడా వేస్తున్న నేపథ్యంలో ఎన్నికలు యథాప్రకారం జరగొచ్చన్న వాదన వినిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: