విత్తన భాండాగారంగా చెప్పుకునే రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. పేరుకు అక్కడక్కడా తనిఖీలు చేసి, కొంత మంది పై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ఏటా కొన్ని లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. అయితే సర్కారు నుంచి పరిహారం మాత్రం అందడం లేదు. లక్షల రూపాయలు అప్పు చేసి పంటలు పండిస్తే దిగుబడి రాక తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ విత్తనాల బెడద అన్ని పంటల్లోనూ ఉంది. అయితే పత్తికి సంబంధించిన విత్తనాలు ఎక్కువగా నకిలీవి వస్తున్నాయి. వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు చాలా నష్టపోయారు. అంకుర్ 10122 BG-2 విక్టర్ అనే కంపెనీలతో పాటు మరో రెండు కంపెనీలకు సంబందించిన విత్తనాలు వేశారు. మిగతా కంపెనీల విత్తనాలను వేస్తే పూత, కాత బాగానే వచ్చినా, ఒక్క అంకుర్ విత్తనాలు వేస్తే మొక్కలు ఏపుగా
పెరిగాయంటున్నారు. అయితే ఆరు నెలలైనా పూత లేదు, కాత కాయలేదంటున్నారు.ఎకరాకు 40 నుంచి 50 వేల పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. ఏటా కొనే దగ్గరే విత్తనాలు ఉన్నామని, అయినా ఇలా మోసపోయామని చెబుతున్నారు రైతులు. నకిలీ విత్తనాల విషయాన్ని డీలర్ల దృష్టికి తీసుకెళ్తే, కంపెనీ పేరు బయటపెట్టొద్దని, నష్టపరిహారం అందేలా కంపెనీలతో మాట్లాడతామని డీలర్లు చెప్పారని రైతులు అంటున్నారు. విత్తనాలు వేసే టైంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు రైతులు.
పత్తి సాగు పెంచాలంటూ వ్యవసాయశాఖ సూచనలతో చాలా మంది రైతులు పత్తి సాగు వైపు వెళ్లారు. అయితే నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీంతో నాసిరకం,నకిలీ విత్తనాలు కొని రైతులు నట్టేట మునుగుతున్నారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు, రైతు సంఘాల నేతలు. నకిలీ విత్తన కంపెనీలపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి, లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.