ఏపీలో కొత్త పరిశ్రమల రాక విషయంలో చాలా రోజులు తరువాత ఓ శుభవార్త వినిపించింది. దేశంలో అతిపెద్ద ఔషధ తయారీ పరిశ్రమగా ఉన్న సన్ ఫార్మా సంస్థ ఏపీలో తన ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సంస్థ అధినేత దిలీప్ సంఘ్వి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని క్యాంప్ ఆఫీస్‌లో కలిసి దీనికి సంబంధించి చర్చలు జరిపినట్టు మీడియాకు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అభివృద్ది విధానాలు, పర్యావరణ రక్షణ వంటి అంశాల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్టుగా ఈ సందర్భంగా దిలీప్ సంఘ్వి వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత పారిశ్రామికంగా అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉండిపోవడం, ఏపీ ఈ విషయంలో వెనుకబడటం తెలిసిందే. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చకపోవడంతో ఏపీకి చెప్పుకోదగిన రీతిలో పెట్టుబడులు రావడం లేదు. ఉపాధి కోసం యువకులు ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ ఆ ప్రాంత అభివృద్దికి ఎంతగానో దోహదపడుతోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ ఔషధ తయారీకి హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదిగింది. వీటిలో అత్యధికం ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలవే. ఆ సమయంలోనే విశాఖలో కొన్ని ఔషధ పరిశ్రమలు ఏర్పాటై విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా ప్రస్తుతం కొత్తగా ఏపీకి రాబోతున్న సన్ ఫార్మా సంస్థ దేశంలోనే పెద్ద సంస్థ కాగా, జనరిక్ మందుల తయారీలో ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది. ఈ సంస్థ ఉత్పత్తుల్లో 72 శాతం అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 12,800 కోట్లకు పైగా టర్నోవర్ సాధించగా, నికరలాభం రూ. 2,140 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్నది సమగ్ర ఔషధ తయారీ సంస్థగా ఉండబోతున్నదని సంస్థ అధినేత దిలీప్ సంఘ్వి తెలిపారు. సన్ ఫార్మా యూనిట్ ఏర్పాటు తర్వాతనైనా ఏపీకి పరిశ్రమల రాక ఊపందుకుంటుందేమో చూడాలి.