కాంగ్రెస్ ఎప్పటికి ఇంతేనా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాదా? తాజాగా తెలంగాణలో రచ్చబండ కార్యక్రమంపై పార్టీ లో జరిగిన రచ్చ పై క్యాడర్ నుంచి వస్తున్న కామెంట్స్ ఇవి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద,వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విరుచుకుపడ్డా పార్టీలో సైలెన్స్ రాజ్యమేలుతుంది. హైకమాండ్ కు జగ్గారెడ్డి లేఖ రాసిన గాంధీ భవన్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చ చేసింది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పన్నిన రాజకీయ వ్యూహం వికటించి సొంత పార్టీలోనే మంటలు రేపింది. ఏకంగా సీఎం సొంత ఊరిలోనే ఆందోళన చేసి షాక్ ఇద్దామనుకున్నా రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి రూపంలో భారీ షాక్ తగిలింది.
ఒక్కరోజు నిర్వహించే రచ్చబండ పై ప్రజల్లో చర్చ జరిగితే, రచ్చబండ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం దాని ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. రచ్చబండకు ముందురోజు కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆ మరునాడు పార్టీ అధినేత సోనియా గాంధీ కి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా గాంధీభవన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. రేవంత్ ను సమర్థిస్తూ లేదా విమర్శిస్తూ ఎవరూ మాట్లాడకపోవడం కూడా ఇప్పుడు హస్తం పార్టీ లో సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే జగ్గారెడ్డి రాసిన లేఖ బయటికి పొక్కగానే ఆయన రాసిన లేఖలోని అంశాలు మరీ కరకుగా లేకుండా సుతిమెత్తగా ఉండడం పార్టీలో సీనియర్ నేతల్లో ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
లేఖలో రేవంత్ పై చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అధినేత్రికి వివరిస్తూ రాయడంతో రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పరోక్షంగా జగ్గారెడ్డి లేవనెత్తిన వాదనలో బలముందని కామెంట్స్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీలో ఎవరినీ కలుపుకు పోవడం లేదని, వన్ మ్యాన్ షో నడిపిస్తూ సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు జగ్గారెడ్డి తన లేఖలో రాశారు. అందరినీ కలుపుకొని పోవల్సిన పీసీసీ చీఫ్ పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే జగ్గా రెడ్డి లేఖ వివాదం పార్టీని కుదిపేసినా,ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం కూడా పార్టీలో చర్చకు దారి తీసింది.