అమరావతి : పవన్ సత్తా ఏమిటో కాపు ప్రముఖులు తేల్చేశారా ?

Vijaya


కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు మొదటిసారి ఓపెన్ అయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మ్యారేజీలో జేడీ లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధా, కన్నా లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, కాపు రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ ఆరేటి ప్రకాశరావు లాంటి కొందరు ప్రముఖులు కలిశారు. ఎలాగూ కలిశారు కాబట్టి వాళ్ళ మధ్య కాపుల విషయమై చర్చ జరిగింది. ఈ చర్చలో రాజకీయపార్టీ ఏర్పాటు సాధ్యమేనా ? పెట్టినా నిలదొక్కుకుంటుందా ? అనే అంశాలపై చర్చ జరిగింది.



అయితే మొత్తం చర్చలో మొదటిసారిగా ప్రముఖల మధ్య ఒక విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అదేమిటంటే మెగాబ్రదర్స్ ఇద్దరు ఫెయిలయ్యారని.  ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి ఫెయిలయ్యారని అందరికీ తెలిసిందే. కానీ బహిరంగంగా కాపు ప్రముఖుల్లో చాలామంది ఆ విషయాన్ని అంగీకరించరు. చిరంజీవి ఫెయిల్యూర్ పై బహిరంగంగా మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అంతరంగిక చర్చల్లో మాత్రం చిరంజీవి ప్రయోగంపై ఘాటుగానే మాట్లాడుకుంటారు.



ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ విషయానికి వస్తే మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటిది తాజా భేటీలో చిరంజీవి, పవన్ ఇద్దరు రాజకీయంగా ఫెయిలయ్యారనే విషయంపై చర్చ జరగటం, అందరు ఆ విషయాన్ని అంగీకరించటం గమనార్హం. విషయం పరిజ్ఞానం, నిలకడ ఉన్నా సరైన ప్లానింగ్ లేకపోవటం, జనాలెవరికీ తెలియని కొందరిని నమ్మి నెత్తినపెట్టుకోవటం, కేవలం కొందరికి మాత్రమే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు అప్పగించటం వల్లే చిరంజీవి ఫెయిలయ్యారు.



ఇక పవన్ విషయానికి వస్తే అన్నీ మైనస్ లే.  విషయం పరిజ్ఞానం లేదు, నిలకడలేదు, ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తెలీదు, చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల  కోసమే పనిచేస్తాడని, ప్యాకేజీస్టార్ అనే ప్రచారం, జగన్మోహన్ రెడ్డి అంటే గుడ్డి వ్యతిరేకత లాంటి అనేక అంశాల వల్లే పవన్ ఫెయిలయ్యారని తేలిపోయింది. చిరంజీవి అంటే రాజకీయాల నుండి వెళ్ళిపోయారు కాబట్టి ఏమి మాట్లాడుకున్నా చెల్లుబాటవుతుంది. కానీ పవన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవ్వాలని కలలు కంటున్నారు.



అయినా కూడా కాపు ప్రముఖులు చిరంజీవి లాగే పవన్ కూడా ఫెయిలైపోయారని తేల్చేయటమే ఆశ్చర్యంగా ఉంది. కాపులే పవన్ పైన ఫెయిల్ అనే ముద్రవేస్తే ఇక మిగిలిన సామాజికవర్గాలు పవన్ను ఎందుకు పట్టించుకుంటారు. పైగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నా సీఎం పదవైతే వచ్చే అవకాశం లేదన్నది తెలిసిందే. ఇంతోటిదానికి కాపులంతా కష్టపడి చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలనే చర్చ కూడా మొదలైంది. మరి చివరకు ఏమి తేలుస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: