నేడే ప్రారంభం: హైదరాబాద్‌కు కేటీఆర్ న్యూఇయర్ గిఫ్ట్..!

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. కొత్త సంవత్సర వేళ.. ఓ కొత్త ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అతి పెద్ద ఫ్లై ఓవర్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించబోతున్నారు. ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యంగా ఉండనున్న ఈ ఫ్లైఓవర్‌ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఆ ఫ్లైఓవర్ ఎక్కడ అంటారా.. అదే టోలీ చౌకి ఫ్లైఓవర్.. టోలిచౌకీ రిలయన్స్‌ మార్ట్‌ నుంచి షేక్‌పేట, రాయదుర్గం ముల్కం చెరువు వరకు ఉన్న ఈ పెద్ద ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.


ఈ ఫ్లైఓవర్ దాదాపు మూడు కిలో మీటర్ల పొడవు ఉంది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా చాలా సౌకర్యాలు రాబోతున్నాయి. ఇది ఏకంగా ఆరు లైన్ల ఫ్లైఓవర్ కావడం విశేషం. అంతే కాదు.. ఈ  ఫ్లై ఓవర్‌ కింద ఓ అద్భుతమైన పార్కు కూడా ఏర్పాటు చేశారు. బయో డైవర్సిటీ అధికారులు ఫ్లై ఓవర్‌ కింద వివిధ మొక్కలతో అద్భుతమైన పార్కు రూపొందించారు. అంతే కాదు.. వాకింగ్‌ ట్రాక్‌, ఫౌంటెయిన్లు కూడా ఉన్నాయి. ఇలా ఓ ఫ్లైఓవర్‌ కింద పార్కు ఉండటం హైదరాబాద్‌ నగరంలో తొలిసారి.


ఇక ఈ ఫ్లై ఓవర్‌ విశేషాల్లోకి వెళ్తే.. దీన్ని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి స్కీమ్‌లో నిర్మించారు. రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని 2.8 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. ఈ భారీ ఫ్లై ఓవర్‌తో నానల్‌నగర్‌ నుంచి ఖాజాగూడ వరకూ సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం సాధ్యం అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు దాదాపు 11 కిలోమీటర్ల కూడా సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణమే.


ఈ ఫ్లైఓవర్‌తో నగరం నుంచి హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ల వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇన్నర్‌ రింగు రోడ్డు నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు లక్డీకాపూల్‌, మెహిదీపట్నం, టౌలిచౌకీ, గచ్చిబౌలి రూట్లలో ప్రయాణించే దాదాపు 4 లక్షల మందికి ఈ ఫ్లైఓవర్‌తో ప్రయోజనం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: