అమరావతి : ఆ ‘రెండింటి’ని ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారా ?

Vijaya



రెండు బలమైన సామాజికవర్గాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉంది. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇపుడు టీడీపీ తరపున కమ్మ, కాపు సామాజికవర్గాలను వైసీపీకి దూరంచేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.  రాజకీయంగా ప్రత్యర్ధులను దెబ్బ తీయటానికి ప్రతి పార్టీ ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తుంది. తాజాగా పై రెండు సామాజికవర్గాలను వైసీపీకి దూరం చేయాలనే వ్యూహాలను అమలు చేయాలని రెండుపార్టీలు ప్లాన్ చేస్తున్నట్లున్నాయి.




మొదట ఈ వ్యూహాన్ని పవన్ మొదలుపెట్టారు. ఆమధ్య ఎక్కడ మాట్లాడినా కమ్మసామాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం వర్గశతృవుగా చూస్తోందంటు పదే పదే చెప్పారు. పవన్ దృష్టిలో వర్గశతృవు అంటే ఏమిటో ఎవరికీ తెలీదు. ఏదో పదం బాగుందని వాడినట్లున్నారు. అసలు కమ్మ సామాజికవర్గం అనే కాదు ఏ సామాజికవర్గాన్ని అయినా ప్రభుత్వం ఎందుకని వర్గశతృవుగా చూస్తుంది  ? ఈ ప్రశ్నకు  మాత్రం పవన్ సమాధానం చెప్పలేదు.




జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబునాయుడు రాజకీయ ప్రత్యర్ధే కానీ కమ్మసామాజికవర్గం కాదని అందరికీ తెలుసు. కానీ పవన్ మాత్రం మొత్తం సామాజికవర్గాన్నే జగన్ కు దూరం చేసేందుకు ప్రయత్నించారు. విచిత్రమేమిటంటే తమను ప్రభుత్వం వర్గశతృవుగా చూస్తోందని ఒక్క కమ్మ నేత కూడా ఇప్పటివరకు చెప్పలేదు. కమ్మవాళ్ళు కాకుండా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ ప్రభుత్వంపై ఆరోపణ చేయటమే విచిత్రం. ఇపుడు అలాంటి ప్రయత్నమే టీడీపీ నుండి మొదలైంది.




టీడీపీ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు మాట్లాడుతు కాపులను ప్రభుత్వం వర్గశతృవుగా చూస్తోందని ఆరోపించారు. కాపులకు వైసీపీ బద్ధశతృవంటు నిమ్మల తీవ్రమైన ఆరోపణే చేశారు. ఈయన చెప్పిన రెండు కారణాలు కూడా చాలా సిల్లీగా ఉన్నాయి. మొదటిదేమో చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తే జగన్ ప్రభుత్వం అమలు చేయలేదట. ఇక రెండో కారణం ఏమిటయ్యా అంటే వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించటమట. కాపులకు 5 శాతం రిజర్వేషన్ చెల్లదని సుప్రింకోర్టే కొట్టేసింది. ఇక రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించాల్సిన అవసరం వైసీపీకి ఏముంది ?




రాధాకు జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ నేతలతో చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. రాధాను చంపాల్సినం త అవసరం వైసీపీకి లేదు. అసలు రెక్కీ జరగనే లేదని విజయవాడ పోలీసు కమీషనరే స్వయంగా చెప్పారు. తనను చంపటానికి రెక్కీ జరిగిందని రాధా ఎందుకు చెప్పారో తెలీదు. రాధా కూడా పలానా వారు రెక్కీ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. నాలుగు రోజులు ఆగితే మొత్తం విషయం బయటకు వస్తుంది.



ఇక్కడ కూడా విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం తమను వర్గశతృవుగా చూస్తోందని ఏ కాపు నేత చెప్పలేదు. కమ్మ మాజికవర్గానికి చెందిన రామానాయుడు కాపుల తరపున ఈ ఆరోపణ చేయటమే విచిత్రం. ఏదేమైనా ఒకేసారి కమ్మ, కాపు సామాజికవర్గాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నదైతే వాస్తవం. మరి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా ? చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: