బాబు స్ట్రాటజీ: పవన్-రాధా-కనిపించని మూడో మనిషి?

M N Amaleswara rao
ఇటీవల ఏపీలో కాపు కులం టార్గెట్‌గా రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపులు..రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. రాష్ట్రంలో గెలుపోటములని డిసైడ్ చేసే పరిస్తితుల్లో ఉన్న కులాల్లో కాపులు కూడా ఉండటంతో...వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కాపులు ఎక్కువ సంఖ్యలో వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకే జగన్‌కు భారీ మెజారిటీ సాధ్యమైంది.

ఇక వారిని తమవైపుకు తిప్పుకోవడానికి చంద్రబాబు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌కు కాపులని దూరం చేయడానికి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్‌ని దగ్గర చేసుకోవడానికి బాబు బాగానే ప్రయత్నిస్తున్నారని ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల...చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా కాపు వర్గం ప్రభావం ఎక్కువ ఉన్న స్థానాల్లో.

అందుకే ఈ సారి అలా జరగకూడదని చెప్పి బాబు ప్లాన్ చేసుకున్నారు. ఎలాగైనా పవన్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు పవన్‌కు కూడా బాబు తప్ప మరో ఆప్షన్ లేదు...ఎలాగో సొంతంగా గెలిచే సత్తా లేదు కాబట్టి...బాబుతో కలవాల్సిందే. అలాగే కాపు వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వంగవీటి రాధాతో కూడా కీలక నియోజకవర్గాల్లో కాపులని టీడీపీ వైపు తిప్పేలా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇప్పటికే రాధా...పలు నియోజకవర్గాల్లో కాపులతో సమావేశమవుతూ..వారిని టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇద్దరే కాకుండా మూడో వ్యక్తితో కూడా రాజకీయంగా లబ్ది పొందేందుకు బాబు స్కెచ్ వేశారని తెలిసింది. ఇటీవల కాపు నేతల సమావేశంలో సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇక ఆయనకు రాష్ట్రంలో బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆయన ద్వారా కూడా లబ్ది పొందేందుకు బాబు సరికొత్త స్ట్రాటజీతో ముందుకు రానున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: