అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో నాకేం సంబంధం లేదని ఎవరైనా భావిస్తే.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందేనని మండిపడ్డారు. జగన్ పాలన ప్రజా వేదిక విధ్వంసంతోనే మొదలైందని.. ప్రజా వేదిక కూల్చివేతతోనే జగన్ తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి.. ఆ ప్రజా వేదికనే కూల్చేయమని చెప్పిన ఘనుడు జగన్ అని.. ప్రజా వేదికను విధ్వంసం చేసిన జగన్.. ఆ డెబ్రిస్సును తీయలేకపోయారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి అన్ని కులాలు, మతాల వాళ్లు భూములిచ్చిన రైతులని ప్రభుత్వం ఇబ్బంది పెట్టారని.. ప్రభుత్వం కట్టిన భవనాలను నిరుపయోగంగా వది లేశారని అగ్రహించారు.
సైబరాబాదుని గ్రాఫిక్స్ అని.. విధ్వంసం చేసుంటే ఇవాళ హైదరాబాద్ ఎక్కడుండేది..? అని ప్రశ్నించారు. అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని.. పోలవరంపై ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు రూ. 10 వేల కోట్ల మేర అదనంగా ఖర్చయ్యేలా ఉందని నిప్పులు చెరిగారు. పోలవరం నిర్వాసితులకు ఇస్తామన్న పరిహరం ఏమైంది..? 2021 నాటికి పోలవరం పూర్తవుతుందన్న జగన్.. ఇప్పుడెళ్లి డీపీఆర్ ఆమోదించమని అడుగుతున్నారని అగ్రహించారు. పట్టిసీమ నీళ్లే గతైందని.. పరిశ్రమలు తేవడం చాలా కష్టమని పేర్కొన్నారు. కష్టపడి తెచ్చిన ప్రముఖ సంస్థలు రాష్ట్రాన్ని వీడిపోతున్నాయని.. జాబ్ క్యాలెండర్ అన్నారు.. జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని వెల్లడించారు.
ప్రశ్నిస్తే దాడులు చేసే పరిస్థితి.. ఏకంగా పార్టీ కార్యాలయాల పైనే దాడులు చేస్తున్నారని.. ఆత్మహత్యల్లో ఏపీది మూడో స్థానమన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఏపీలో వ్యవసాయాన్ని నాశనం చేశారని అగ్రహించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టమని.. 30 నెలల పాలనలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని అగ్రహించారు. కరోనా వల్ల ప్రపంచం నష్టపోయింది.. జగన్ పాలన వల్ల ఏపీ నష్టపోయిందని.. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని విమర్శించారు. జగనుకు తాను తప్ప ఎవ్వరూ అక్కర్లేదు.. చెల్లి లేదు.. తల్లి లేదని అగ్రహించారు.