బూస్టర్ డోస్ గా.. చుక్కల మందు?

praveen
ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. ప్రతి ఒకరికి వాక్సిన్ పై అవగాహన రావడంతో స్వచ్ఛందంగా ముందుకు వస్తూ వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే భారత్ 100 కోట్లు వ్యాక్సినేషన్ మార్క్ ను కూడా దాటేసింది. ఇప్పటికే ఎంతోమంది రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుని కరోనా వైరస్ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నవారికి కూడా ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేస్తున్నారు. అయితే ఇటీవల సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ ప్రపంచదేశాలను భయపెడుతోంది. అటు వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నది కూడా ప్రస్తుతం ఎవరికీ తెలియని ప్రశ్న గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ పై పోరాటం చేయాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకొని ఉండాలి అంటూ పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే  పలు దేశాలలో బూస్టర్ డోస్ కింద పలు వ్యాక్సిన్లు అనుమతి ఇస్తూ ఉండడం గమనార్హం. భారత్లో బూస్టర్ కోసం ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.  భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు నాజల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్ గా వినియోగించేందుకు.. దీనికి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ డిసిజిఐ ని కోరింది భారత్ బయోటెక్.


 ఇప్పటికే  రెండు డోసులు వాక్సిన్లు తీసుకున్న వారికి బూస్టర్ డోస్ గా  ఈ చుక్కల మందు ఎంతో అనువైనది అంటూ భారత్ బయోటెక్ చెబుతోంది. ఇక ఓమిక్రాన్ నేపథ్యంలో బుస్టర్ డోస్ పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ చుక్కల మందు ఎంతో అనువుగా అందరికీ అందించే విధంగా ఉంటుందని.. క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల దరఖాస్తు చేసుకుంది భారత్ బయోటెక్. అయిదు వేలమంది వాలంటీర్ల పై పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాము అంటూ దరఖాస్తులో తెలిపింది. ఇందులో సగం మంది కోవాక్సిన్, సగం మంది కోవిషీల్డ్ తీసుకున్న వారిని ఎంపిక చేసుకుంటాము అంటూ చెప్పుకొచ్చింది. రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటే ప్రయోజనం  ఎక్కువగా ఉంటుందని భారత్ బయోటెక్ చెప్పుకొచ్చింది. ఇక భారత్ బయోటెక్  ప్రస్తుతం నిపుణుల కమిటీ, డిసిజిఐ  ఈ అనుమతి కోసం ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: