పంజాబ్‌లో మోదీకి అవ‌మానం..? స‌హిస్తారా..?

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు ప్రొటోకాల్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తులు ఎక్క‌డ ప‌ర్య‌టించినా ఆయ‌న ర‌క్ష‌ణ‌కు, గౌర‌వానికి ఏమాత్రం భంగం క‌ల‌గ‌నివిధంగా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. అక్క‌డ స్వ‌ప‌క్షం ఉన్నా విప‌క్షాలు అధికారంలో ఉన్నా ఈ సంప్ర‌దాయం పాటించి తీరాలి. కానీ ఇటీవ‌లికాలంలో దేశ రాజ‌కీయాల్లో విప‌రీత పోక‌డ‌లు పొడ‌చూపుతున్నాయి. అన్ని ఆన‌వాయితీలకు కాల‌దోషం ప‌ట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార వేడిలో ఉన్న పంజాబ్‌లో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం కోసం వెళ్లిన‌ ప్ర‌ధాని మోదీకి బుధ‌వారం ఎంత‌మాత్రం ఊహించ‌ని ఘ‌టన ఎదురైంది. నిర‌స‌న‌కారులు ప్ర‌ధాని వెళుతున్న ర‌హ‌దారిని నిర్బంధించ‌డంతో ఆయ‌న కాన్వాయ్ ఓ వంతెన‌పై ఇరుక్కుపోయింది. దాంతో ఏకంగా 20 నిమిషాల‌పాటు ఆయ‌న అక్క‌డే ఆగిపోవాల్సివ‌చ్చింది. దీంతో ప్ర‌ధాని మోదీ త‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఆ రాష్ట్రంలో ఇదో రాజ‌కీయ వివాదంగా మార‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


పంజాబ్‌లోని హుస్సేనివాలాలో ఉన్న జాతీయ అమ‌ర‌వీరుల స్మార‌కాన్ని సంద‌ర్శించే ల‌క్ష్యంతో ప్ర‌ధాని మోదీ బుధ‌వారం బ‌ఠిండా చేరుకున్నారు. ఆ త‌ర్వాత హెలికాఫ్ట‌ర్ ద్వారా సంద‌ర్శ‌నా స్థ‌లానికి వెళ్లేందుకు ఏర్పాట్లు జ‌రిగినా, వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో రోడ్డు మార్గం ద్వారా చేరుకునేందుకు నిర్ణ‌యించారు. దీంతో పంజాబ్ డీజీపీకి ప్ర‌ధాని వెళ్లే మార్గంపై వివ‌రాలు అందించారు. ఆ మార్గంలో భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాల‌పై పంజాబ్ పోలీస్ శాఖ అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలియ‌జేశాకనే ప్ర‌ధాని కాన్వాయ్ బ‌య‌లుదేరింది. అయితే దారిలో కొంద‌రు ఆందోళ‌న‌కారులు ర‌హ‌దారిని నిర్బంధించ‌డంతో ప్ర‌ధాని వాహ‌నం స‌హా కాన్వాయ్ అంతా ఓ ఫ్లైఓవ‌ర్‌పై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని బ‌ఠిండా ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు. పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు  భ‌ద్ర‌తా ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే జరిగిన ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని కేంద్ర హోం శాఖ ఆగ్ర‌హించి, దీనిపై నివేదిక ఇవ్వాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో హోరాహోరీ త‌ల‌ప‌డేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కూట‌మి, ఆప్ పార్టీలు ఇప్ప‌టికే  క‌త్తులు దూసుకుంటూ ప్ర‌చార ప‌ర్వంలో మునిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాజ‌కీయ ప‌క్షాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు కేంద్ర‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ధిక్కారాన్నే స‌హింతునా అన్న‌ట్టుండే ప్ర‌ధాని మోదీకి అవ‌మాన‌మే ఎదురైతే త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉంటాయో మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: