చరిత్రలో.. రేట్లు తగ్గించి ఇబ్బందుల్లో పడ్డ ఏకైక ప్రభుత్వం ఇదే..

Deekshitha Reddy
నిత్యావసరాలు కానీ, అప్పుడప్పుడూ వాడుకునే వస్తువులు కానీ, ఎప్పుడో ఒకసారి వాడేవి కానీ.. వేటి ధరలు పెరిగినా ప్రజల్లో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వస్తుంది. రేట్లు తగ్గిస్తే ఆ ప్రభుత్వంపై ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తారు, మరో దఫా అదే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతుగా మద్దతిస్తారు. కానీ ఏపీలో మాత్రం ఈ సీన్ రివర్స్ లో జరుగుతోంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లను తగ్గించింది ప్రభుత్వం. రేట్లు తగ్గించడం వల్ల ప్రజల్లో సింపతీ పెరుగుతుందని, ప్రభుత్వానికి మద్దతిస్తారని ఆశించారు అమాత్యులు. కానీ అక్కడ జరిగింది, జరుగుతోంది వేరు. టికెట్ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. దానిపై మరో కమిటీ వేయాల్సిన అవసరం వచ్చింది.

సినిమా టికెట్లు సరే.. మిగతావాటి సంగతేంటి..?
ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కానీ ఏపీలో నిర్మాణాలకు అవసరమైన ఇసుక రేటు కూడా భారీగా పెరిగిపోయింది. విశాలమైన నదీ తీరాలు, అందుబాటులో ఇసుక ఉన్నా కూడా పేద, మధ్యతరగతి ప్రజలకు అది పెను భారంగా మారింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మరి అన్నిట్నీ పక్కనపెట్టి సినిమా టికెట్ల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది. సరిగ్గా సగటు మనిషి ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

తగ్గిస్తే సంబరపడండి కానీ..
ప్రభుత్వం వాదన మరోలా ఉంది. వస్తువుల, వస్తు సేవల రేట్లు తగ్గితే ప్రజలు సంబరపడాలి కానీ, కొంతమంది ఇలా వ్యతిరేకించడం ఏంటనేది ప్రభుత్వం వాదన. సినిమా టికెట్లతోపాటు, ఫలానా వస్తువుల రేట్లు తగ్గించండి అని అడిగితే పర్లేదు కానీ, దాన్ని మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే ఏం చేస్తామంటున్నారు మంత్రులు. కానీ ప్రజల్లో మాత్రం సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఆశించినంత పాజిటివ్ మూడ్ ని తీసుకురాలేకపోయింది. ఎప్పుడో ఒకసారి వెళ్లే సినిమా టికెట్ రేట్లను తగ్గించడంలో, ఆ వివాదంలో కోర్టులో న్యాయపోరాటం చేయడంపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ, నిత్యావసరాల విషయంలో ఏమైందని నిలదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న వస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. సినిమా టికెట్ రేట్లు తగ్గించి, మిగతా వాటితో లేనిపోని పోలిక తెచ్చుకుంది. అనుకోని డిమాండ్లు ఎదురవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: