ఢిల్లీ : పంజాబ్ ఘటనపై మోడీకి సూటి ప్రశ్నలు..జవాబిస్తారా ?

Vijaya


పంజాబ్ లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఒక ఫ్లైఓవర్ దగ్గర రైతులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఈ విషయమై కేంద్ర హోంశాఖ-రాష్ట్రప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కాబట్టి ఈ విషయాలను వదిలేస్తే ప్రతిపక్షాలు, నెటిజన్ల నుండి నరేంద్రమోడి, బీజేపీకి కొన్ని సూటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి వీటికి సమాదనాలు చెప్పాల్సిన బాద్యతయితే మోడీపైనే ఎక్కువుంది.




ఇంతకీ ఆ సూటి ప్రశ్నలు ఏవంటే భద్రతా వైఫల్యం ఉందని చెబుతున్న మోడీకి కేంద్ర హోంశాఖ వైఫల్యం ఎందుకు గుర్తుకు రావటంలేదని నిలదీస్తున్నారు. ఫ్లైఓవర్ పై 20 నిముషాలు వెయిట్ చేయటానికి కూడా ఇష్టపడని మోడిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. 20 నిముషాలు వెహికల్లోనే కూర్చునే బదులు బయటకు వచ్చి రైతులతో ఒకసారి మాట్లాడుంటే సరిపోయేది కదాని అడుతున్నారు. 20 నిముషాలు కూడా వెహికల్ కూర్చోలేనపుడు మరి రైతుసంఘాలు ఏడాదికి పైగా ఢిల్లీ శివార్తలో ఎలా ఉద్యమాలు చేశారో ఇప్పటికైనా తెలిసిందా అంటు ఎద్దేవా చేస్తున్నారు.




హెలికాప్టర్లో వెళ్ళాల్సిన మోడి వాతావరణం బాగాలేకపోవటంతో చివరకు రోడ్డు మార్గాన వెళ్ళారు. దీనిపైన కూడా ప్రతిపక్షాలు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వర్షాలకు, వాతావరణం బాగాలేకపోయినా బ్రహ్మాండంగా ప్రయాణించగలవనే కదా వేల కోట్ల రూపాయలు పెట్టి ఫ్రాన్స్, రష్యాల నుండి హెలికాప్టర్లు కొనుగోలు చేసిందని గుర్తుచేస్తున్నారు. మరలాంటి హెలికాప్టర్లలో ఇపుడెందుకు ప్రయాణం చేయలేదని అడుగుతున్నారు.  కావాలనే రోడ్డు మీద ప్రయాణం చేసి రాజకీయంగా లబ్దిపొందాలన్న దురాలోచనే మోడిలో కనబడుతోందని జనాలు ఎద్దేవా చేస్తున్నారు. ఎలాంటి దాడి జరగకపోయినా దాడి జరిగిందన్నట్లుగా ప్రచారం చేయటంపైన కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.




ర్యాలీకి, బహిరంగసభకు అనుకున్నంతగా జనాలు రాలేదని సీఎం చన్నీ మండిపడుతున్నది నిజమేనా అని నిలదీస్తున్నారు. 70 వేలమంది వస్తారని అనుకుంటే వచ్చింది 700 మంది కాబట్టే మోడీ ప్రోగ్రామ్ ను రద్దు చేసుకున్నట్లు సీఎం చన్నీ ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రోగ్రామ్ ను రద్దు చేసుకున్న మోడి సమాధానం చెప్పలేక చివరకు భద్రతా వైఫల్యమంటు రాష్ట్రప్రభుత్వంపై నెట్టేస్తున్నారంటు చన్నీ గట్టిగా తగులుకున్నారు. దీనికి మోడి సమాధానం చెప్పాలంటు నెటిజన్లు కూడా గట్టిగానే అడుగుతున్నారు.




ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో గడ్డకట్టే చలిలో ఉద్యమాలు చేసిన రైతులను, మరణించిన రైతుల కుటుంబాలను ఒక్కసారైన మోడి ఎందుకు పరామర్శించ లేదని నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదని తెలిసీ కావాలనే మోడి సింపతి డ్రామాకు తెరలేపినట్లు నెటిజన్లు, ప్రతిపక్షాలు గట్టిగా వాయించేస్తున్నాయి. మరి కనీసం దీనికైనా మోడి జవాబిస్తారా ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: