ఆ మహావీరుడు.. పాముల పుట్టలో దాక్కున్నాడు..?
అందుకే చరిత్ర చాలా అవసరం. చరిత్ర అధ్యయనం కూడా అవసరం. మరి జరిగిపోయిన కాలం గురించి ఎలా తెలుసుకుంటాం.. గతంలో ఏం జరిగిందో ఎలా అంచనా వేస్తాం.. ఇందుకు అనేక చారిత్రక ఆధారాలు మనకు సహకరిస్తాయి. వాటిలో ప్రాచీన శిల్పాలు... శాసనాలు కీలకమైన ఆధారాలుగా నిలుస్తాయి. అలాంటి వెయ్యేళ్ల నాటి కీలక ఆధారాలు తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వెలుగు చూశాయి.
దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా భావిస్తున్న శిల్పాలను పరిశోధకులు గుర్తించారు. ఇన్నాళ్లూ ఆదరణకు నోచక మట్టి పాలైన విగ్రహాలను వారు గుర్తించి.. అధ్యయనం ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని పుల్లూరు గ్రామంలో ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఓ పాములపుట్టలో కూరుకుపోయిన జైన విగ్రహాలను వెలికి తీశారు. ఈ వెలికి తీతలో పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఈయనతో పాటు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ మరియు ఆ బృందంసభ్యులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, అన్వర్ బాషా ఈ వెలికితీత, అధ్యయన ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఈ విగ్రహాల వివరాల్లోకి వెళ్తే.. 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు, మాతంగ యక్షుడి శిల్పాలుగా వీటిని భావిస్తున్నారు. పద్మాసనంలో ధ్యానముద్రలో ఉన్న నల్ల శాసనపురాతి విగ్రహం మహావీరుడిదిగా భావిస్తున్నారు. ఇవి 10వ శతాబ్ది నాటి రాజు వేములవాడ చాళుక్యుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు.