ఏపీలో ఉద్యోగులకు సంక్రాంతి కానుక.. పీఆర్సీ ఎంతంటే..?
పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నారు. జనవరి 01, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జులై 01, 2018 నుంచి అమలు కానున్నది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 01,2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోపు నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్లు అదనపు భారం పడనున్నది. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీలే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేయడమే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామన్నారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30 లోపు ప్రొబేషన్, కన్పర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసి సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జులై జీతం నుంచి చెల్లిస్తారు.
ఇక ఫిట్మెంట్ విషయానికొస్తే.. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ, అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్మెంట్ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సవినయంగా అర్థంచేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను అని సీఎం జగన్ తెలిపారు.