మంత్రి వర్గ విస్తరణ బాటలో మూడు రాజధానులు..
ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదని.. మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఆందోళనలు జరిగినా మూడు రాజధానుల స్టాండ్ మీదే నిలబడింది. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నాక అతి త్వరలోనే దాన్ని తిరిగి ప్రవేశ పెడతామని అసెంబ్లీలోనే చెప్పారు జగన్. అయితే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలియడంలేదు. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకనో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరూ మూడు రాజధానుల విషయంపై స్పందించడం లేదు. గతంలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా రాజధాని ప్రస్తావన తీసుకొచ్చేవారు. అమరావతి రాజధాని వద్దని, మూడు రాజధానులు ఉంటేనే సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉపన్యాసాలు దంచి కొట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల కొత్త బిల్లు వ్యవహారాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర ప్రభావం కూడా ప్రభుత్వంపై కొంతమేర ఉందని తెలుస్తోంది. ఈ దీక్షలకు బీజేపీతో పాటూ టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దీంతో వైసీపీలో ఆలోచనలో పడింది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా అమరావతి రాజధాని కోసం పోరాడాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. దీంతో వైసీపీ కూడా అమరావతి రాజధాని విషయంలో తొందరపడకూడదని భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసినట్టుగా.. మూడు రాజధానుల విషయాన్ని కూడా ఇలా వాయిదాల మీద వాయిదాల వేస్తున్నట్టు తెలుస్తోంది.